హైదరాబాద్ : హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 14 పోస్టాఫీస్ కార్యాలయాలలో పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయని పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. ఈ నెల 20నుంచే ఆ కార్యాలయాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. పోస్టాఫీసు కార్యాలయాలలో పాస్‌సోర్టు సేవలను అందిస్తాయని ఆయన ప్రకటించారు. ఇందుకు ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల మధ్యలో 700 సాధారణ అపాయింట్మెంట్లు ఇస్తామని వెల్లడించారు.
ప్రతి రోజు అపాయింట్మెంట్లలో 10 నుంచి 15 శాతం కొన్ని కారణాలతో తిరస్కరణకు గురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి విషయాలు ఇతర దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారుతోందని ఆందోళన చెందారు. అపాయింట్మెంట్ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అపాయింట్మెంట్ల కోసం దరఖాస్తుదారులు వేచి చూడకుండా త్వరితగతిన సేవలు అందిస్తామని అన్నారు. ఉద్యోగ, విద్య, మెడికల్ అవసరాలకు సంబంధించిన పత్రాలు కలిగిన దరఖాస్తులను అపాయింట్‌మెంట్ల రీషెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.