Monday, December 23, 2024

వ్యాపార సరకుగా నీరు

- Advertisement -
- Advertisement -

నీటి వ్యాపారం ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దాని విలువ 27 వేల కోట్ల డాలర్లు. నీటిపై వివిధ దేశాల్లో బడా బహుళ జాతి సంస్థలు ప్రభుత్వాల నుంచి హక్కులు పొంది నీటి వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలను తరలించుకు పోతున్నాయి. సహజ నీటి వనరులపై ప్రజలు హక్కులను కోల్పోతున్నారు. ప్రకృతి సహజమైన నీరు సకల జీవరాసులకు సహజంగా లభించాలి. నీటిని తాగు, సాగు అవసరాలకై ప్రజలందరికీ అందేలా చూడటం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చటం లో పాలక ప్రభుత్వాలు అత్యధికం విఫలమవుతూ వస్తున్నాయి. సహజమైన నీటి వనరులు లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల సహజమైన నీరు గత మూడు దశాబ్దాలకు పైగా ప్రైవేట్‌పరం చేయటం తీవ్రమైంది.
గత 70 సంవత్సరాల పైగా ప్రపంచ జనాభ మూడు రెట్లు పెరగగా, నీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. పరిశ్రమల వాడకానికి నీటి వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. పరిశ్రమలకు నీటి అవసరాలు పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వ రాయితీలతో, ప్రజల సొమ్ముతో తమ నీటి అవసరాలను తీర్చుకోవటమే కాకుండా, నీటిపై తమ గుత్తాధిపత్యం కోసం పెట్టుబడిదారుల ప్రయత్నాలు ప్రారంభమైనాయి. పెట్టుబడిదారుల సహజ లక్షణమైన తక్షణ లాభమే తప్ప వారికి నిలకడైన అభివృద్ధి పట్టదు. తాగు నీటి అవసరాలు పెరగటంతో పెట్టుబడిదారులకు నీరు ఎంతో లాభసాటి వ్యాపారంగా మారింది. 1992లో డబ్లన్ వాటర్ కాన్ఫరెన్స్, వరల్డ్ వాటర్ విజన్ నీటిని ఒక ఆర్థిక వస్తువుగా అంటే సరుకుగా అభివర్ణించింది. జీవించే హక్కు అనేది ప్రజల మౌలిక హక్కు. అందుకు ఆహారం, నీరు, గూడు ప్రజల మౌలిక హక్కుల్లో భాగం. నీరు లేకపోతే జీవితమే ఉండదు. అందువలన అది ప్రజల మౌలిక హక్కు. అది సరుకుగా చూడటం నేరం.
నీటి ప్రైవేటీకరణను సమర్ధించేవారు రెండు వాదనలు ముందుకు తెస్తున్నారు. మొదటిది- ప్రైవేటీకరణ వలన నీటి వసతుల నిర్వహణ మెరుగుపడుతుందని, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, సమర్ధవంతంగా నీరు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నా రు. రెండవది- నీరు ఉచితంగా లభించటం వలన అవసరానికి మించి ప్రజలు నీటిని వాడుతున్నారని, ప్రైవేటీకరించటం వలన డబ్బు చెల్లించవలసి రావటంతో నీటిని ప్రజలు పొదుపుగా వాడతారని చెప్పటం. ఇవన్నీ ప్రైవేటీకరణను సమర్ధించే వాదనలు. నీరు వృథాగా పోతున్నట్లు ఎక్కడ కన్పించినా ప్రజలు దానికి మరమ్మతులు చేస్తారు. రైతాంగంపైన కూడా ఇలాంటి విమర్శ చేశా రు. సాగు నీరు వృథా కాకుండా ఉండటానికి నీటి మీటర్లు బిగించాలనే ప్రతిపాదన తెచ్చి తీవ్ర వ్యతిరేకత రావటంతో చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నీటి ప్రైవేటీకరణ జరుగుతున్నది జల వనరుల సంరక్షణ కోసం కాదని, వ్యాపారుల దోపిడీ కోసమన్నది వీరు విస్మరించారు.
ఏ ప్రైవేటీకరణ అయినా అది ప్రజల కోసం కాదని, బడా వ్యాపారుల కోసమే అన్నది వాస్తవం. నీటి ప్రైవేటీకరణ జరగటం వలన ఉచితంగా అందాల్చిన తాగు నీరు డబ్బులు చెల్లించి ప్రజలు కొనుక్కోవాలి. ప్రైవేట్ కంపెనీలు అధిక మొత్తంలో లాభాలు గడించటమనే కోణం నుంచి నీటి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి తప్ప ప్రజల అవసరాలను, దీర్ఘకాలిక నీటి మనుగడ దృక్పథం ఉండదు. బహుళ జాతి సంస్థలు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల మద్దతుతో పబ్లిక్ నీటి వనరులను ప్రైవేటీకరించి తమతో కాంట్రాక్టు కుదుర్చుకోవడానికై అర్ధ వలస దేశాల పై విపరీతమైన వత్తిడి చేస్తున్నాయి.
నీటి ప్రైవేటీకరణ- అంతర్జాతీయ అనుభవం
నీటి ప్రైవేటీకరణ మొదట లాటిన్ అమెరికాలో ప్రారంభమైంది. నేడు ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాలకు విస్తరించింది. ఇందు కు కూడా ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ పాత్ర కీలకంగా ఉంది. వెనుకబడిన దేశాలకు రుణాలు మంజూరు చేసేటప్పుడు నీటిని ప్రైవేటీకరణ చేయాలని షరతులు విధిస్తున్నాయి. ప్రభుత్వాలు నీటి వనరులను అసమర్ధంగా నిర్వహించడం లేదనే ప్రచారం చేసి ప్రైవేటీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.ప్రైవేట్ కంపెనీలు అత్యధిక లాభాలకు నీటిని అమ్మటం అంటే, అది మానవ జీవనానికి అత్యంత మౌలిక అవసరమైన నీటిని సాధారణ ప్రజలకు నిరాకరించటమే. 75% వరకు నీటి వ్యాపారం కొన్ని యూరోపియన్ దేశాల, అమెరికా బహుళ జాతి కంపెనీల అదుపులో ఉంది. ఈ కంపెనీలు వివిధ దేశాల ప్రభుత్వాలపై నీటిని, నీటి నిర్వహణను ప్రైవేట్‌పరం చేయాలని విపరీతమైన వత్తిడి పెట్టి విజయం సాధించాయి.

నీటిని ప్రైవేటీకరణ చేసినప్పుడు బ్రిటన్ లో 1988 -95 మధ్య నీటి బిల్లులు 67% పెరిగాయి. బొలీవియాలో మునిసిపల్ నీటి సరఫరా ప్రైవేటీకరణ తర్వాత నీటి బిల్లుల విపరీతంగా పెరిగాయి. ఆ దేశంలోని కొచమాంబ నగరంలో నీటి యుద్ధాలు జరిగాయి. ఫ్రాన్స్‌లో కూడా నీటి బిల్లులు 150% పెరిగాయి. ఆఫ్రికా ఖండంలో నీటి ప్రైవేటీకరణ తర్వాత ప్రజలకు నీటి హక్కు నిరాకరించబడింది. నీటి అమ్మకం ధరలు 45% పెరగగా, కంపెనీ లాభాలు 692% పెరిగాయి. ఈ కంపెనీల సిఇఒల జీతాలు 700% పెరిగాయి.
భారత దేశంలో నీటి ప్రైవేటీకరణ
భారత దేశంలో కూడా నీటి ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కనుసన్నల్లో దేశ జల విధానాలు రూపొందించడం జరుగుతున్నది. 2002 భారత ప్రభుత్వం జాతీయ జల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం ఎక్కడ సాధ్యమైతే అక్కడ జల వనరుల పథకాల ప్లానింగ్, అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నది. ఒక దశాబ్ద కాలంలోనే దేశంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్టుల సంఖ్య 300కు చేరింది. మహారాష్ట్రలో 48, కర్ణాటకలో 26, తమిళనాడు 25, ఢిల్లీలో 20, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 ప్రాజెక్టులు ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్నాయి. నీటి సరఫరాలో ఇతర దేశాల్లో లాగానే భారత్‌లోనూ ప్రైవేట్ రంగం విఫమైంది. టాటా సమూహానికి చెందిన జెయుఎస్‌సిఒ, జెంషెడ్‌పూర్‌తో పాటు మైసూర్, భోపాల్, గ్వాలియర్, కొలకత్తా, హాల్దియా, ముజఫర్‌పూర్, చెన్నై నగరాల్లో జల నిర్వహణ బాధ్యతలు తీసుకుని విఫలమైయ్యాయి.
జల విధానం రాక ముందే భారత దేశంలో 1990లో జల వనరుల ప్రైవేటీకరణ ప్రారంభమైంది. శివనాధ్ నదిలో 23 కిలో మీటర్ల దూరం పాటు రేడియస్ వాటర్ సప్లయ్‌కి 22 సంవత్సరాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1998లో ఒక కార్పొరేట్ సంస్థకు లీజుకు ఇచ్చింది. ఫలితంగా మొదటిసారి ఒక నది కార్పొరేట్ సంస్థ చేతుల్లోకి పోయింది. 23 కిలోమీటర్ల నదికి ఇరువైపులా కార్పొరేట్ సంస్థ కంచె వేసింది. ఫలితంగా ఆ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు నీటిని వాడుకోవటం పైనా, చేపల వేటపైనా నిషేధానికి గురైయ్యారు. ప్రైవేటీకరణ దుష్పరిణామాలను గమనించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినా మధ్యప్రదేశ్ ప్రభుత్వం లీజుని కొనసాగించింది. సూయజ్, విలెండి, థేమ్స్ వాటర్, బెక్టేల్ వంటి పెద్ద బహుళ జాతి కంపెనీలు భారత దేశంలో నీటి ప్రాజెక్టులు నడుపుతున్నాయి.

నీటి వ్యాపారం ద్వారా బడా కంపెనీలు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుండగా, ప్రజల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. 1990లలో పార్లే కంపెనీ మన దేశంలో ‘బిస్లరీ’ పేరుతో వాటర్ బాటిల్స్‌ను ప్రవేశపెట్టింది. భారత దేశంలో 3 వేల ఆర్గనైజ్డ్ వాటర్ బాటిల్ కంపెనీలు, మరో 12 వేల అన్-ఆర్గనైజ్డ్ కంపెనీలు ఉన్నాయనే అంచనా ఉంది. పెప్సి, కోకాకోలా వంటి బహుళ జాతి కంపెనీలు ఆక్వాఫీనా, కీన్లీ వంటి బ్రాండ్లతో నీటి వ్యాపారం ద్వారా వేల కోట్ల భారత సంపదను కొల్లగొడుతున్నారు. బిస్లరీ, కీన్లే, ఆక్వాపీనా, బెయిలీ, హిమాలయన్ మినరల్ వాటర్, మానిక్ చంద్ ఆక్సీరిస్ మినరల్ వాటర్, టాటా వాటర్ ప్లస్, రైల్‌నీర్‌లు భారత దేశంలో అతిపెద్ద వాటర్ కంపెనీలు. 2022 నాటికి భారత్‌లో 43,663 కోట్ల నీటి వ్యాపారం జరగగా, 2024 నాటికి ప్రతి సంవత్సరం 6,500 కోట్ల నీటి వ్యాపారం జరుగుతుందనే అంచనా ఉంది.

బడా వ్యాపార సంస్థల నీటి వ్యాపారం ప్రమాదంగా మారి ప్రపంచ వ్యాపితంగా నీటి కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడతారని అనేక మంది నిపుణులు తెలియచేస్తున్నారు. భారత దేశంలో 2050 నాటికి నీటి సంక్షోభం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని కూడా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలంటే, సహజ నీటి వనరులపై ప్రజలదే హక్కని, నీటి వనరులను ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని, బహుళ జాతి కంపెనీల నీటి వ్యాపార అనుమతులను రద్దు చేయాలని ప్రపంచ దేశాల ప్రజలు, భారత దేశం ప్రజలు ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News