Thursday, January 23, 2025

చైనా వ్యతిరేక వ్యూహం?

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ చేసే ప్రతి అంతర్జాతీయ పర్యటన ఆయనకు విశేషమైన కీర్తిని కట్టబెడుతుందనే అభిప్రాయం కలగడం కొత్త విషయం కాదు. అయితే ఆ కీర్తి భారత దేశం ముందడుగుకు తోడ్పడుతున్నదా, కేవలం పరస్పర మర్యాదపూర్వకమైన ప్రశంసల వద్దనే ఆగిపోతున్నదా? ఈ ప్రశ్నకు రెండోదే వాస్తవమనే సమాధానాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు. జపాన్‌లోని హిరోషిమాలో మూడు రోజుల పాటు జరిగిన జి7 బృంద దేశాల శిఖరాగ్ర సమావేశానికి అతిథిగా మోడీ హాజరయ్యారు. పనిలో పనిగా ఆస్ట్రేలియా, పాపువాన్యూగినియాలో కూడా పర్యటించారు. ఆస్ట్రేలియాలో అక్కడి ప్రవాస భారతీయుల సభకు హాజరైనప్పుడు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బానీస్, ప్రధాని మోడీని బాస్ అంటూ పైకెత్తారు. అలాగే హిరోషిమాలో మోడీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసల్లో ముంచెత్తారు. అమెరికన్ భారతీయులలో విశేష ప్రాచుర్యం గల నాయకుడని ఆకాశానికి ఎగరేశారు.

ఆదివారం నాడు పసిఫిక్ ద్వీప దేశం పాపువాన్యూగినియాను ప్రధాని మోడీ సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు జేమ్స్ మరపే అయితే గౌరవ సూచకంగా మోడీ పాదాలనే తాకారు. అణుబాంబు విలయానికి గురైన హిరోషిమాలో జి 7 సమావేశాల భేటీ జరగడం ఆ బృంద దేశాల శాంతి ప్రియత్వానికి తిరుగులేని సంకేతమని చెప్పుకొంటున్నారు. అయితే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలతో కూడిన జి7 లక్షం ప్రపంచంలో శాంతి స్థాపనే అని అనుకోలేము. ప్రధాని మోడీ లడఖ్‌లో చైనా దురాక్రమణ దాడిని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించి ప్రభావవంతమైన అంతర్జాతీయ వ్యవస్థలు లేకపోడాన్ని గట్టిగా ఎత్తి చూపారు. ఐక్యరాజ్య సమితి చేతగానితనాన్ని ఎండగట్టారు. అయితే ఆ సంస్థను తన జేబులోని బొమ్మగా చేసుకొని ఏకైక అగ్ర రాజ్యంగా ఇష్టావిలాస రాజకీయం నడిపిస్తున్న అమెరికా ముందే ఈ ప్రస్తావన చేయడం వల్ల ప్రయోజనం శూన్యమేననేది సుస్పష్టం. సోమవారం నాడు పోర్టు మోర్స్‌బైలో పసిఫిక్ దీవుల సహకార వేదిక (ఎఫ్‌ఐపిఐసి) సమావేశాలు జరిగాయి.

ఇండో పసిఫిక్ జలాల్లో ఆధిపత్యం కోసం చైనా ఆరాటం, దానిని నిరోధించడం కోసం అమెరికా వ్యూహ రచన నేపథ్యంలో ఈ సమావేశాలకు విశేష ప్రాధాన్యం వుంది. చైనాతో సుదీర్ఘమైన సరిహద్దు కలిగిన భారత్‌ను క్వాడ్‌లో చేర్చుకోడం ద్వారా న్యూఢిల్లీని బీజింగ్‌కు ప్రతికూల దిశలో నిలబెట్టి తన పబ్బం గడుపుకోవాలని అమెరికా వేసిన ఎత్తుగడ తెలిసిందే. పసిఫిక్ దీవుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పాపువాన్యూగినియాతో అమెరికా కుదుర్చుకొన్న రక్షణ ఒప్పందం ఆ ద్వీప దేశాన్ని చైనాపై ఎక్కుపెట్టడం కోసం ఉద్దేశించిందే. ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత పాపువాన్యూగినియా ప్రధాని మరపే చేసిన ప్రకటన గమనించదగినది. అమెరికా, చైనా ఆధిపత్య పోరుతో తమకు సంబంధం లేదని తాము ఎటువైపు వుండబోమని ఆయన స్పష్టం చేశారు. మొత్తం పసిఫిక్ దీవులన్నింటిదీ ఇదే అభిప్రాయమని ఆయన వివరించారు. అయితే పాపువాన్యూగినియాతో అమెరికా సాగర గర్భ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకొన్నది.

అక్రమ చేపల వేట, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లను అరికట్టే విషయంలో పాపువాన్యూగినియాకు అమెరికా తీర రక్షక దళాలు తోడుగా వుండడానికి ఉద్దేశించిన ఒప్పందం ఇది. చైనాతో తమకు మంచి సంబంధాలే వున్నాయని, తాము చైనాకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములమని కూడా మరపే ప్రకటించారు. అంతకు ముందు ఈ ఒప్పందాల పట్ల స్థానికులు నిరసన ప్రదర్శనలు చేశారు. పాపువాన్యూగినియా మాదిరి మరో పసిఫిక్ ద్వీప దేశం సోలోమన్ ఐల్యాండ్స్ గత ఏడాది చైనాతో ఇదే మాదిరి రక్షణ ఒప్పందం కుదుర్చుకొన్నది. అమెరికాకు గాని, జి 7లోని ఇతర దేశాలకు గాని శాంతి స్థాపన మీద దృష్టి వుంటే అన్ని వివాదాస్పద అంశాలపైనా చైనాతో, రష్యాతో చర్చలు జరపవచ్చు. అందుకు భిన్నంగా యుద్ధానికి దారి తీసే వైరుధ్యాన్ని అవి పెంచి పోషిస్తున్నాయి. 2014లో జి8 బృందం నుంచి రష్యాను బహిష్కరించాయి.

రష్యా ప్రమేయం లేకుండా అణు నిరాయుధీకరణ ఎలా సాధ్యమవుతుంది? ఒంటి చేత్తో చప్పట్లు కొట్టగలమా? చైనా జి7లో తనకు సంబంధించిన అంశాలపై మాట్లాడడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. తమ దేశంలోని జపాన్ రాయబారిని పిలిపించి ఆ నిరసనను తెలియజేసింది. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ హిరోషిమాలో జరిగిన జి7 భేటీని చైనా వ్యతిరేక కార్యశాల అని వర్ణించింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యాతో చవకగా ఆయిల్ దిగుమతులను పొందడానికి భారత దేశం ఉపయోగించుకొన్నది. అయినా చైనాతో లడాయిలో తమతో కలిసి వస్తుందనే దృష్టితో భారత్‌పై అమెరికా ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అంతిమంగా నెమ్మదినెమ్మదిగానైనా మనం అమెరికా ఒడిలో చేరుతున్నామా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News