పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లా పాలక్కాయం గ్రామంలో గ్రామ పంచాయతీ ఉద్యోగి వి సురేష్ కుమార్‌ను లంచం పుచ్చుకుంటుండగా విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. లంచంగా పుచ్చుకున్న రూ. 1 కోటిని అతని వద్ద నుంచి విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్నార్‌క్కాడ్‌లో రెవెన్యూ అదాలత్ సందర్భంగా ఒక వ్యక్తి నుంచి రూ. 2,500 లంచం పుచ్చుకుంటుండగా విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేష్ కుమార్‌ను విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతను అద్దెకుంటున్న గదిలో తనిఖీ చేయగా రూ. 1 కోటి విలువైన నగదు, డిపాజిట్ పత్రాలు అధికారులకు
సురేష్ కుమార్ తనను మూడవసారి లంచం డిమాండ్ చేసినట్లు ఒక వ్యక్తి నుంచి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందించింది. మంగళవారం రెవెన్యూ అధాలంత్ జరుగుతుండగా అధికారులు అతనిపై కన్నేసి ఉంచారు. లంచం పుచ్చుకుంటున్న సమయంలో అతడిని అరెస్టు చేసిన అధికారులకు ఇంతపెద్ద మొత్తంలో అతని వద్ద నుంచి అవినీతి సొమ్ము బయటపడుతుందని వారు ఊహించలేదు. సురేష్ కుమార్ గదిలో రూ. 35 లక్షల నగదు, రూ. 45 లక్షల విలువైన బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లు, బాండ్లు, సేవింగ్స్ బ్యాంకులో రూ. 25 లక్షలు లభించినట్లు పాలక్కాడ్ డిఎస్‌పి ఎస్ షంసుద్దీన్ విలేకరులకు తెలిపారు. ఇవేగాక 10 కొత్త చొక్కాలు, పెద్దమొత్తంలో చింతపండు, 10 లీటర్ల తెనె, గుట్టల కొద్దీ పెన్నులు, ఇతర వస్తువులు అతని గదిలో దొరికినట్లు ఆయన చెప్పారు. మన్నార్‌క్కాడ్‌లో 2001 నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌గా సురేష్ పనిచేస్తున్నాడు.