Monday, December 23, 2024

గుక్కెడు నీళ్ళివ్వని డబుల్ ఇంజిన్

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల (9వ క్లాస్) ప్రణవ్.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తన తల్లి బాధను చూడలేకపోయాడు. మండుటెండల్లో కాలినడకన వెళ్లి ఆమె బిందెలతో నీళ్లు తేవడాన్ని తట్టుకోలేకపోయాడు. నీటి కోసం ఇంటి ఆవరణలోనే రోజుల తరబడి శ్రమించి బావి తవ్వాడు. ఇదీ కేంద్రంలోని బిజెపి నేతృత్వంలో గల డబుల్ ఇంజిన్ సర్కారు పాలన తాలూకు ఫలితం. తాగు నీరు అందించడం ఏ ప్రభుత్వానికైనా కనీస బాధ్యత. జల్ జీవన్ మిషన్ కింద.. హర్ ఘర్ జల్ పేరుతో ఇంటింటికీ నీరు అందిస్తున్నామని బిజెపి పెద్దలు స్పీచులు దంచుతారు.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి.
జలశక్తి శాఖ లెక్కల ప్రకారం.. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగు నీరు అందిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర 1,11,22,327 నల్లా కనెక్షన్లతో మూడో స్థానంలో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. పలు జిల్లాల్లో నీటి కోసం జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నాసిక్ జిల్లాతో పాటు మరాఠ్వాడ ప్రాంతంలోని జాల్నా, హింగోలి జిల్లాల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి అధికారులు ఏకంగా.. మరాఠ్వాడాలోని మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఆరింటిలో 447 బావులను స్వాధీనం చేసుకున్నారు. ఔరంగాబాద్, జాల్నా జిల్లాల్లో 85 చొప్పున, హింగోలిలో 177, నాందేడ్లో 108, బీడ్లో 54, లాతూర్‌లో 11 బావులలోని నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. మహారాష్ట్రలో కృష్ణా, గోదావరి, తపతి, నర్మదా తదితర నదులు ప్రవహిస్తాయి. జల వనరుల వినియోగం సరిగా లేనందున.. రాష్ట్రంలో తాగు నీటికి, సాగు నీటికి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాల అసమర్థత కారణంగా నేటికీ 40 % మహారాష్ట్రలో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. డబుల్ ఇంజిన్ సర్కారు ఏలుబడిలో తాగునీరు.. సాగు నీరు లేదు.
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర సమస్య
బిజెపి డబుల్ ఇంజిన్ సర్కారు ఏలుబడిలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యోగి ఆదిత్యనాథ్ సిఎంగా ఉన్న ఈ రాష్ట్రం జల్ శక్తి శాఖ లెక్కల ప్రకారం.. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి నీళ్లు అందిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే సెకండ్. కానీ ఈ వేసవిలో యుపిలోని దాదాపు 20 జిల్లాల్లో జనం నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లకు యుపి ప్రభుత్వం రూ. 16 వేల కోట్లు ఖర్చు పెడితే.. తెలంగాణలో మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నళ్లాలు వేసి నీళ్లు ఇచ్చేందుకు సిఎం కెసిఆర్ రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశారు’ అని అన్నారు. బండి అన్నట్లు ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు నీటి కోసం ఎందుకు బావుల వద్దకు బిందెలతో వెళ్తున్నట్లు? బుందేల్‌ఖండ్ జల్ మంచ్ అనే సంస్థల లెక్కల ప్రకారం.. ప్రతి వేసవిలో యుపిలో 65 శాతం గ్రామీణ జనాభా నేటికీ చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాలకు తాత్కాలిక వలస వెళ్తున్నారు. బిజెపి హర్ ఘర్ జల్ ఎటు పోయింది? హిందూ పురాణాల ప్రకారం యుపిలోని చిత్రకూట్ చాలా ప్రాముఖ్యత ప్రాంతం. అయితే బిజెపి ఏలుబడిలో ఇక్కడి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది గిరిజనులు కలుషిత నీరు తాగాల్సిన దుస్థితి. ఏండ్ల తరబడి మురికి నీరు తాగడం వల్ల రోగాల బారినపడి జనం అక్కడ చనిపోవడం సాధారణంగా మారింది. వందలాది గిరిజన గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
మధ్యప్రదేశ్‌లో 17 జిల్లాల్లో..
డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే.. మధ్యప్రదేశ్ ప్రజల నీటి కష్టాలు పోతాయని ప్రగల్భాలు పలికిన బిజెపి.. ఆ సమస్యను తీర్చలేకపోయింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో తాగునీటి సమస్యే ఆ పార్టీకి సవాలుగా మారింది. రాష్ట్రంలో దాదాపు 50 శాతం కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవు. 48.69 లక్షల గ్రామీణ కుటుంబాలు, 4,258 గ్రామాలకు కుళాయి నీటి కనెక్షన్ ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, నీటి సరఫరా సరిగా జరగడం లేదని అనేక మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. దాదాపు 17 జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. 2018 లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 2020లో సిఎంగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్ తాగునీటి సమస్యపై ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారు. ఇక్కడ నీటి ఎద్దడి ఎంతగా పెరిగిపోయిందంటే చాలా గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం బావుల వద్దకు వెళ్లి ప్రమాదకర పరిస్థితిలో ప్రాణాలను పణంగా పెట్టి నీళ్లు తెచ్చుకుంటన్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే జిల్లా దిండోరి. ఈ జిల్లా ప్రత్యేకించి తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గ్రామస్థులు బకెట్ నీటి కోసం ప్రతి రోజు తమ ప్రాణాలను పణంగా పెట్టి బావుల్లోకి దిగాల్సి వస్తోంది. సియోని జిల్లాలోని అదేగావ్ ప్రాంతంలో, బోర్వెల్ల నీటి మట్టాలు పడిపోయాయి.
గుజరాత్‌లో..
గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, ఉత్తర గుజరాత్, మధ్య, దక్షిణ గుజరాత్లోని గిరిజన ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నా యి. రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వారానికి రెండు సార్లు కూడా నీటి సరఫరా చేయడం గగనంగా మారిపోయింది. 14 జిల్లాల్లోని సుమారు 500కి పైగా గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్లతోనే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ సరఫరా కూడా వారానికి ఒకసారే. సర్ ప్లస్ వాటర్ స్టేట్‌గా గుజరాత్ ఆదర్శంగా మారిందని ఊకదంపుడు విన్యాసాలు చెప్పే ప్రధాని మోడీకి.. తమ నీటి కష్టాలు తీరలేదంటూ 50 వేల మంది మహిళలు ఆ మధ్య ఓ లేఖ కూడా రాశారు. అయినా వారి సమస్య తీరలేదు.
ఉత్తరాఖండ్‌లో..
దేవభూమిగా భావించే ఉత్తరాఖండ్‌లో తాగునీటి కొరత తీవ్రంగానే ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 11,54,854 ఇండ్లకు నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా తెలుస్తున్నా ప్రజలకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. నల్లా కనెక్షన్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు.. కానీ ఆ నల్లాల నుంచి నీళ్లు రావడం లేదు. గ్రామంలో ఉన్న వీధి నల్లా దగ్గరనే గ్రామస్థులు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా.. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని కుటుంబాలు ఇంకా ఉన్నాయంటే.. ఈ పాపం దేశాన్ని ఇంతకాలం ఏలిన, ఏలుతున్న కాంగ్రెస్, బిజెపిలదే. నదుల్లో ఈ దేశానికి సరిపోయే తాగునీరు, సాగు నీరు ఉన్నా, వాటిని వాడుకోలేని అసమర్థత మన ప్రభుత్వాలది. జల్ జీవన్ మిషన్ కంటే ముందే.. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో తెలంగాణలో అని ప్రతి ఆవాసంలోని ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్‌ది. తెలంగాణ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి.. పేరు మార్చుకున్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలకు జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇచ్చింది.. కానీ.. ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసినా.. భగీరథకు నిధులు ఇవ్వలేదు. సాక్షాత్తు ప్రధాన మంత్రే భగీరథను మెచ్చుకున్నా.. ఆయన నుంచి పైసా ప్రయోజనం దక్కలేదు. తాగేందుకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని డబుల్ ఇంజిన్ సర్కారును ఈ దేశ ప్రజలు ఎలా నమ్మగలరు? అందుకే కర్ణాటక నుంచి ఓడించడం మొదలుపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News