చెన్నై: తమిళనాడు సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య(ఆవిన్)కు సంబంధించిన పాల సేకరణ ప్రాంతంలోకి కియారా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం(అమూల్) చొరబాటును వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆవిన్‌కు సంబంధించిన పాల సేకరణ ప్రాంతంలో పాల సేకరణ చేపట్టవద్దని అమూల్‌ను ఆదేశించాలని స్టాలిన్ తన లేఖలో అమిత్ షాను కోరారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో అమూల్ పాల శీతలీకరణ కేంద్రాలను, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని తన లేఖలో స్టాలిన్ ప్రస్తావించారు. కృష్ణగారితోపాటు ధర్మపురి, వెల్లూరు, రాణిపేట, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలలో పాల సేకరణకు అమూల్ సన్నాహాలు చేస్తుండడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఒకరి పాల సేకరణ ప్రాంతంలోకి మరొకరు చొరబడకూడదన్నది సహకార సొసైటీలు మొదటి నుంచి పాటిస్తున్న సాంప్రదాయమని, ఇప్పుడు దానికి తిలోదకాలు ఇవ్వడం వల్ల క్షీర విప్లవ స్ఫూర్తికే విఘాతం ఏర్పడగలదని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఆవిన్ పాల సేకరణ నిర్వహిస్తున్న ప్రాంతాలలోకి అమూల్ ఇప్పుడు చొరబడడం తగదని ఆయన పేర్కొన్నారు. ఆవిన్‌తో అనేక ప్రైవేట్ డైరీలు ఇప్పటికే పోటీ పడుతున్నాయని, ఇటువంటి పరిస్థితిలో అమూల్ రాక అనారోగ్యకర పోటీకి దారితీయగలదని స్టాలిన్ పేర్కొన్నారు.