హైదరాబాద్ : ఐఆర్‌బి డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్ టోల్ గేట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఓఆర్‌ఆర్ టోల్ గేట్ విషయంలో సిబిఐకి, ఈడి ఫిర్యాదు చేశామని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓఆర్‌ఆర్ టోల్ గేట్ అంశంపై బిజెపి చాలా రోజులుగా ప్రశ్నిస్తోందన్నారు. ఓఆర్‌ఆర్ అంశంపై ఎందుకు ప్రశ్నించడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారని, తమకెవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
రూ.7.200 నుంచి రూ.7.380 కోట్లకు ఓఆర్‌ఆర్ టెండర్ విలువ పెంచిందెవరని మండిపడ్డారు. దీనిపై సంబంధిత మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేర చరిత్ర కలిగిన ఐఆర్‌బికి ఇచ్చిన టెండర్ రద్దు చేయాలన్నారు.మున్సిపల్ శాఖ అప్పనంగా ఐఆర్‌బి అనే సంస్థకు టెండర్ అప్పగించారు. ఐఆర్‌బి సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారు. వేసవి సెలవుల తర్వాత దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ టెండర్ అని చెప్పి… నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించారు.