లక్నో: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బహిష్కరించడం అసమంజసమని బీఎస్‌పి అధినేత్రి మాయావతి గురువారం వ్యాఖ్యానించారు. ప్రారంభోత్సవాన్ని ఆమె స్వాగతించారు. తనకు ఆహ్వానం అందినా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా భవన ప్రారంభోత్సవానికి తాను హాజరు కావడం లేదని వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, లేదా ఇప్పుడు బీజేపీ ఉన్నా దేశానికి సంబంధించిన అంశాలకు , ప్రజా ప్రయోజనాలకు బీఎస్‌పీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని మాయావతి స్పష్టం చేశారు.
పార్టీ రాజకీయాలకు అతీతంగా ఈనెల 28న జరగనున్న పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ప్రారంభోత్సవం చేయించాలని విపక్షాలు ఒత్తిడి తీసుకురావడం కూడా అసమంజసమేనని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం తనకు హక్కు ఉందని స్పష్టం చేసిందని, అలాంటప్పుడు గిరిజన మహిళ గౌరవంతో సంబంధం పెట్టడం అసమంజసమేనని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిగా ముర్ము ఏకగ్రీవంగా ఎన్నిక కాడానికి బదులు పోటీగా అభ్యర్థిని నిలబెట్టినప్పుడు ఈ సంగతి ఆలోచిస్తే బాగుండేదని చురకలంటించారు.