హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో ఎంఎస్‌టిసి నిర్వహించిన ప్లాట్ల ఈ వేలానికి భారీ స్పందన లభించింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎంఎస్‌టిసి ద్వారా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి, మేడిపల్లి గ్రామానికి సంబంధించిన ఓపెన్ ప్లాట్ల రెండో దశ ఈ -వేలం హెచ్‌ఎండిఎ నిర్వహించింది. బాచుపల్లిలో మొత్తం 133 ప్లాట్లు, 67,894.23 చదరపు గజాల విస్తీర్ణంలో మేడిపల్లి 85 ప్లాట్లు వేలం నిర్వహించారు. ఈ ప్లాట్ల మొత్తం అప్‌సెట్ ధర విలువ 189.88 కోట్లు కాగా.. ఈ వేలం నిర్వహించగా..రూ. 260.29 కోట్లు ఆదాయం వచ్చింది.
బాచుపల్లిలో చదరపు గజానికి అత్యధిక ధర రూ.53,500 పలుకగా.. మేడిపల్లిలో చదరపు గజానికి 50 వేలు పలికింది. బాచుపల్లిలో కనీస ధర చదరపు గజానికి రూ.25 వేలు ఉండగా.. వేలంలో సగటు ధర చదరపు గజానికి రూ.39,674 పలికింది. మేడిపల్లిలో గజం రూ.32 వేలు ఉండగా.. సగటు ధర రూ.40,668 పలికింది. బాచుపల్లిలో 37497.41 చదరపు గజాల విస్తీర్ణంలో 131 ప్లాట్లు ను రూ.95.24 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.148.77 కోట్ల ఆదాయం వచ్చింది. మేడిపల్లిలో 27421.00 చదరపు గజాల్లో 78 ప్లాట్లకు రూ.94.63 కోట్లు నిర్ధారించగా.. వేలంలో రూ. 111.52 కోట్లు రాబడి సాధించారు. మొత్తం 218 ప్లాట్లకు గాను 209 ప్లాట్లు అమ్ముడయ్యాయి.