ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ , పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ పార్టీకి చెందిన మరో 600 మంది నాయకులు, మాజీ అసెంబ్లీ సభ్యులు దేశం విడిచి పరారీ కాకుండా పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. గురువారం మీడియా కథనాలు ఈ విషయం బయటపెట్టాయి. మే 9 న అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తరువాత ఇమ్రాన్ ఖాన్ ,
ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు హింసకు పాల్పడ్డారన్న నేరారోపణలు తో కేసులు నమోదయ్యాయి. వీరందరూ స్వదేశం విడిచిపెట్టి విదేశాలకు పారిపోకుండా నివారించేందకు వీరి పేర్లను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధారిటీ (ఎఫ్‌ఐఎ) ప్రావిన్షియల్ నేషనల్ ఐడెంటిఫికేషన్ జాబితాలో చేర్చారని తెలుస్తోంది. గత మూడు రోజులుగా పిటిఐ నాయకులు , కార్యకర్తలు కొందరు దేశం నుంచి వెళ్లి పోడానికి ప్రయత్నించినట్టు వారిని విమానాశ్రయాల్లో అడ్డుకున్నట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.