Monday, December 23, 2024

హైదరాబాద్‌లో యుఎఇ కాన్సులేట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాయబార కార్యాలయం, ముంబయి, తిరువనంతపురంలోని కాన్సులేట్ల తర్వాత ఎమిరేట్స్ తన నాలుగో దౌత్య కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని కొత్త యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్ తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ వంటి ఇతర దక్షిణ, మధ్య భారత రాష్ట్రాలకు చెందిన వీసా దరఖాస్తుదారులకు కూడా సేవలు అందిస్తుందని హైదరాబాద్ లోని యుఎఇ కాన్సుల్ జనరల్ ఆరేఫ్ అల్నుయిమి తెలిపారు. దాదాపు 8200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కొత్త యుఎఇ కాన్సులేట్ బంజారాహిల్స్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించబడింది.

ఇది జూన్ 14, 2023న అధికారికంగా ప్రారంభించబడుతుంది. కాన్సులేట్ ప్రారంభం తర్వాత రోజుకు 200 వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సన్నద్ధమై ఉండగా, రాబోయే రెండు నెలల్లో దీనిని రోజుకు 500 దరఖాస్తులకు, భవిష్యత్తులో ప్రతిరోజూ 700-800 వీసాల వరకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాయబారి తెలిపారు. హైదరాబాద్ సహా దక్షిణ భారతదేశం నుండి వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున హైదరాబాద్‌లో కాన్సులేట్ తెరవాలని నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. కొత్త మిషన్, వీసా దరఖాస్తుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందనీ, ప్రాసెసింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది.

‘హైదరాబాద్ లో వీసాలకు డిమాండ్ చాలా ఎక్కువ. ఇప్పటికే ఇక్కడ రెసిడెంట్ వర్కర్ వీసా సౌకర్యాలను అందిస్తున్నాం. సమీప భవిష్యత్తులో ఇతర అన్ని రకాల వీసాలకు కూడా తమ సేవలను విస్తరిస్తామని‘ కాన్సుల్ జనరల్ తెలిపారు. తిరువనంతపురంలోని కాన్సులేట్ జనరల్ లో వీసా దరఖాస్తుదారుల్లో గణనీయమైన సంఖ్యలో ప్రస్తుతం తెలంగాణకు చెందిన వారేనని, తాను తిరువనంతపురంలోని తన సహోద్యోగితో మాట్లాడానని, ఈ రోజు 1000కు పైగా వీసా దరఖాస్తులు ప్రాసెసింగ్ కావాల్సి ఉందని, వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారని, ఎందుకంటే మేము ఇక్కడ ప్రారంభించామని వారికి తెలియదన్నారు.

‘హైదరాబాద్‌లో కాన్సులేట్ తెరవడానికి మరొక కారణం ఏమిటంటే, చాలా మంది యుఎఇ పౌరులు వైద్య, విద్యా వంటి సంబంధిత కారణాలతో హైదరాబాద్ వస్తుంటారని‘ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం గురించి మాట్లాడుతూ 2021-22 లో యుఎఇ భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అనీ, వాణిజ్యం 1970లలో సంవత్సరానికి కేవలం 180 మిలియన్ డాలర్ల నుండి నేడు 73 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన అన్నారు. భారత్‌యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) పై సంతకం చేసిన తరువాత రెండు దేశాల మధ్య చమురుయేతర వాణిజ్య భాగం ఇప్పుడు వేగంగా పెరుగుతోందననీ, 2027 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News