బెంగళూరు: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా జరగొచ్చని మాజీ కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు. కుమార స్వామి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఇది రెండోసారి. ఆయన విలేకరులతో ఎన్నికల ఫలితాలపై సింహావలోకనం చేస్తూ ప్రభుత్వంలో అవిశ్వాసం ఎక్కువగా ఉందన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వానికి ఏమన్నా జరగొచ్చు’అన్నారు. నవంబర్‌లో కూడా ఆయన ఇదే విధంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా హెచ్చరికలు చేశారు.
కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలుచేయడంలో ఆలస్యం చేస్తోందని అన్నారు. ‘అధికారంలోకి రాగానే ఆ గ్యారంటీలను అమలుచేస్తానన్నది. కానీ వాటిని పోస్ట్‌పోన్ చేస్తూ లేక షరతులు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నది. కాంగ్రెస్ ఆ ఐదు గ్యారంటీలు ప్రకటించి నా పార్టీ ఉనికిని దెబ్బతీసింది’ అన్నారు.
కాంగ్రెస్ గ్యారంటీలపై తాను ఉద్యమిస్తానని, ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఆ గ్యారంటీలను ప్రకటించింది? కాంగ్రెస్ గ్యారంటీలే నాకు ఆయుధాలు. మేము క్యాబినెట్ రెండో సమావేశానికి వేచి ఉంటాం. వారు గ్యారంటీలను అమలుచేయకపోతే మేము ప్రజల కోసం పోరాడుతాం’ అన్నారు.
‘నేను ఓ సముదాయానికి బలంగా నిలిచాను. కానీ ఆ సముదాయ ప్రజలు కాంగ్రెస్‌కే ఓటేశారు. మల్లికార్జున ఖర్గే ఒక సముదాయాన్ని జెడి(ఎస్)కు వ్యతిరేకంగా మలిచారు’ అని కుమారస్వామి వివరించారు.