దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ప్రతి నెలా పైకి ఎగబాకుతున్నదే గాని దిగుముఖం పట్టడం లేదు. అలా పెరిగి పెరిగి ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి చేరుకొన్నదని ఇది చాలా ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు నిరుద్యోగం ఇంతగా పైకి చేరుకోడంలోని వైరుధ్యం స్పష్టమే. గ్రామీణ భారతంలో ఒక్క ఏప్రిల్‌లోనే 20.3 మిలియన్ల మంది పనుల్లో చేరారని, అక్కడి కార్మిక భాగస్వామ్యం 2.7 పర్సంటేజ్ పాయింట్లు ఎక్కువై ఏప్రిల్‌లో 43.64 శాతానికి చేరుకొన్నదని, పర్యవసానంగా పల్లె భారతంలో 32 కోట్ల 12 లక్షల మంది ఉద్యోగులయ్యారని చెబుతున్న నిపుణులు పట్టణ ప్రాంతంలో నిరుద్యోగం మరింతగా పెరిగి దాని రేటు 9.5 శాతానికి చేరుకొన్నదని వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పనులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందినవే. వ్యవసాయాధార పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా నెలకొని గ్రామీణ యువతకు, మహిళలకు మెరుగైన ఉద్యోగాలు కల్పించాయని అనుకోడానికి ఎంత మాత్రం వీల్లేదు. అందుచేత వ్యవసాయ రంగంలో కలిగిన ఉద్యోగావకాశాలు గ్రామీణ జనానికి జీవన భద్రతను ఇవ్వగలవని భావించలేము. అవి వాన రాకడ మీద, సాగు యంత్రాల వినియోగంపైనా ఆధారపడి వుంటాయి. వర్షాలు సరిపడా కురియకపోతే ఈ ఉద్యోగాలన్నీ గాలికి పేలపిండిలా ఎగిరిపోతాయి. అందుచేత గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఉద్యోగ, ఉపాధి శాశ్వతమైనవి కావని గ్రహించవలసి వుంది. పని చేసి తమ కాళ్ళ మీద తాము నిలబడాలని కోరుకొంటున్నప్పటికీ అది నెరవేరని పరిస్థితులుండడమే నిరుద్యోగం. ఇటువంటి నిరుద్యోగులు దేశంలో గుట్టలు గుట్టలుగా వున్నారు.
వయసు మీరిపోతున్నా తాము చదువుకొన్న చదువులకు తగిన ఉద్యోగావకాశాలు లభించక నిరుద్యోగులు నిరాశకు గురి అవుతున్నారు. వారిలో ఆశ చావకుండా చేయడానికి ప్రభుత్వాలే ఉద్యోగ అర్హత వయసును తరచూ పెంచుతున్నాయి. జనాభా అమితంగా వుండడం, అదే సమయంలో నాణ్యమైన విద్య కొరవడడం, అధిక శాతం ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడడం, వ్యవసాయ రంగంలో దిగుబడులు, ఉత్పాదకత ఎక్కువగా వుండకపోడం, వ్యవసాయ కార్మికులకు, నైపుణ్యం లేని గ్రామీణ యువతకు ప్రత్యామ్నాయ అవకాశాలు లేకపోడం నిరుద్యోగం అమితంగా వుండడానికి కారణమని బోధపడుతున్నది. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ళ లోపువారే. ఇంతగా యువ జనాభా వున్నప్పటికీ వారిని విద్యావంతులను చేయడం, ఉద్యోగాలు కల్పించడం అనేది అతి పెద్ద సమస్యగా మారింది.
తయారీ రంగంలో ఉద్యోగావకాశాలు పడిపోతున్నాయి. కేవలం సేవల రంగంలోనే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ రంగంలో ఉద్యోగాలు వ్యవసాయేతర రంగంలో గల ఉద్యోగాల్లో 90 శాతానికి చేరుకొన్నాయి. పట్టణ ప్రాంతాల్లో లభిస్తున్న చిన్నచితకా ఉద్యోగాలకు భద్రత కరవవుతున్నది. కేంద్రం అనుసరిస్తున్న అనేక విధానాలు ఉద్యోగాలపై, ఉపాధులపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు చిన్న, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. వాటిలో పని చేసి పొట్ట గడుపుకొంటూ వచ్చిన యువత ఉన్నపళంగా నిరుద్యోగులయ్యారు. అలాగే, కొవిడ్ కాలంలో చాలా మంది కోల్పోయిన ఉద్యోగాలు వారికి తిరిగి లభించలేదు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ క్రితం తాను అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రసంగాల్లో తమకు పగ్గాలు అప్పజెపితే ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానని మహా వాగ్దానం చేశారు. అది ఎంత వరకు ఆచరణలోకి వచ్చిందో వివరించి చెప్పనక్కర లేదు. ఆయన ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వంలోనే లక్షలాది ఉద్యోగ ఖాళీలున్నాయని సమాచారం. ఆయన మాత్రం కుంటుతూ, కునుకుతూ కొద్ది వేల చిన్న ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తున్నట్టు ప్రచా రం చేయించుకొంటారు. దేశాధినేతలే నిరుద్యోగులతో ఇలా పరిహాసం చిత్తగిస్తున్న చోట కొత్త ఉద్యోగాలు ఎలా లభిస్తాయి? సర్వం కార్పొరేట్లకు అప్పగిస్తున్న బిజెపి హయాంలో ప్రభుత్వ రంగం దారుణంగా కుదించుకుపోతున్నది. ప్రభుత్యోద్యోగాల కోసం ఎవరూ ఎదురు చూడలేని పరిస్థితి నెలకొన్నది.
ప్రభుత్వం తనంతతానుగా రిజర్వేషన్లను రద్దు చేయనవసరం లేకుం డా ప్రైవేటైజేషన్ ద్వారా వాటికి తలకొరివి పెడుతున్నది. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య భవిష్యత్తులో అనేక సంక్షోభాలకు దారి తీసే ప్రమాదమున్నది. తయారీ రంగాన్ని గరిష్ఠ స్థాయికి అభివృద్ధి చేయకపోతే పెను ముప్పు తప్పదు. వ్యవసాయాధార స్థితిని తొలగించి ప్రజలను పరిశ్రమలు, వ్యాపార రంగాల వైపు తరలించడమనేది సునాయాసం కాదు.