Monday, December 23, 2024

అరాచక ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటాం

- Advertisement -
- Advertisement -

మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై జరుపుతున్న పోరాటానికి విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో గళం విప్పాలని విపక్ష నేతలను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఇందులో భా గంగానే శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఢిలీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్‌లతో కలిసి సిఎం కెసిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మో డీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. బిజెపియేతర రాష్ట్ర ప్ర భుత్వాలపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలోనూ ఆప్ ప్రభుత్వాన్ని ఇ బ్బందులకు గురి చేస్తోందన్నారు. ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అరవింద్ కేజ్రీవాల్ అద్భుత విజయం సాధించారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఒక సోషల్ మూవ్‌మెంట్ నుంచి వచ్చిన పార్టీయే ఆమ్ ఆద్మీ పార్టీ అని పేర్కొన్నారు. మూడు సార్లు అప్రహతిమైనటువంటి అద్భుత విజయాన్ని సాధించింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇటీవల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్పష్టమైన మెజార్టీ సాధించిందని,ఎన్నో రకాల మాయామశ్చీంద్రలు చేసినా బిజెపిని ఢిల్లీ ప్రజలు తిరస్కరించి, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు గెలిపించిన మేయర్‌ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్ని ముప్పుతిప్పలు చేసిండ్రో మనందరం చూశామన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప మేయర్‌ను కానివ్వలేదని, అది అరాచకమైన పద్ధతి అని విమర్శించారు.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌కు కూడా అతీగతీ లేకపోతే ఎలా..?
ఢిల్లీ ప్రజా ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని సిఎం కెసిఆర్ అన్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని గుర్తు చేశారు. ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిందని, సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తెచ్చిందని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులందరూ పనిచేయాలని, వాళ్ల బదిలీలు, మంచీ చెడులు, నియంత్రణలు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెళుతుందని పేర్కొన్నారు.

చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కూడా కాలరాసే విధంగా, చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్‌ను తెచ్చారని, అది మరీ దుర్మార్గమని పేర్కొన్నారు. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌కు కూడా అతీగతీ లేకపోతే ఎలా..? ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నయని అన్నారు. ఏ ఎమర్జెన్సీ గురించి నరేంద్ర మోడీ, బిజెపి నాయకులు గొంతు చించి మాట్లాడుతరో ఇవ్వాల కచ్చితంగా ఇదే జరుగుతున్నదని చెప్పారు. ఆనాడు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత, ఆ జడ్జిమెంట్‌ను కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేశారని, అప్పుడు చేసినట్లుగానే ఇదే మోడల్‌లో ఇప్పుడు చేశారని తెలిపారు. ఎమర్జెన్సీకి ముందు కూడా ఇలానే చేశారని చెప్పారు.

ఆనాడు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో మహామహుల్లాంటి ఇందిరాగాంధీనే దేశం పక్కకు తప్పించిందని, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ విల్ పవర్‌తో అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఇందిరాగాంధీ తప్పులతో ప్రజలు జనతా పార్టీని గెలిపించారని, ఎవరినైతే గెలిపించిండ్రో వాళ్లే తప్పులు చేస్తే మళ్లీ వాళ్లను తప్పించి ఇందిరాగాంధీని గెలిపించారని పేర్కొన్నారు. తప్పు జరిగినప్పుడు దేశం తప్పక స్పందిస్తున్నదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీలో ఇప్పుడు ఉన్నారని, ఇప్పుడు మీకూ, వాళ్లకు ఏం తేడా ఉంది అని బిజెపి సీనియర్ నేతలను ఉద్దేశించి కెసిఆర్ ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇప్పుడున్న పరిస్థితులే ఉన్నయని చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ తరపున మేమందరం నిలబడతాం
ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని తాము ప్రధానిని డిమాండ్ చేస్తున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. తామందరం అరవింద్ కేజ్రీవాల్ తరపున నిలబడతాం. ఆయనకు మద్దతునిస్తామని వెల్లడించారు. ఆర్డినెన్స్ బిల్లును ఓడించడానికి తాము ఖచ్ఛితంగా లోక్ సభ, రాజ్యసభల్లో తమ శక్తినంతా ఉపయోగించి పాస్ కాకుండా చేస్తామని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడవనీయండని సిఎం హితవు పలికారు. మొహల్లా క్లినిక్స్, విద్య, తాగునీటి వ్యవస్థ, విద్యుత్ రంగంలో రాయితీలివ్వడం, నిరుపేదల గురించి అక్కడ అనేక మంచి కార్యక్రమాలు జరిగాయని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాపులర్ గవర్నమెంట్ కాబట్టే అక్కడి ప్రజలు మూడు సార్లు ఎన్నుకున్నారని, అట్లాంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.

ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నదని, వాళ్లు కూడా భవిష్యత్తులో బిజెపి ప్రభుత్వానికి ఖచ్ఛితంగా బుద్ధి చెబుతారని అన్నారు. ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ కంటే అధ్వాన్న పరిస్థితులున్నాయని, సుప్రీంకోర్టు మెజార్టీ బెంచ్ తీర్పును కాలరాసే పరిస్థితులు ఉన్నయని చెప్పారు. రైతుల నల్ల చట్టాలను వాపస్ తీసుకున్నట్లుగానే ఈ ఆర్డినెన్స్ కూడా వాపస్ తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మీకు మీరే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తదని కేంద్రాన్ని హెచ్చరించారు. కాలాయాపన చేయకుండా వెంటనే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాజభవన్‌లు బిజెపి రాష్ట్ర కార్యాలయాలుగా మారాయి
అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. రాజభవన్‌లు బిజెపి రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని, గవర్నర్‌లు బిజెపి స్టార్ క్యాంపెయినర్లుగా మారారని ఆరోపించారు.
కర్ణాటక ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బీజేపీకి బుద్ధి రాలేదు
దేశంలో బిజెపి అరాచకాలు పరాకాష్టకు చేరాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బిజెపికి బుద్ధి రాలేదని విమర్శించారు.త్వరలో దేశం మొత్తం కూడా బిజెపికి గుణపాఠం చెబుతుందని అన్నారు. బిజెపికి ఢిల్లీ ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆగడాలు, అరాచకాలు బాగా మితిమీరుతూ పరాకాష్టకు చేరుకుంటున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అనేక ముప్పుతిప్పులు పెడుతూ పనిచేయనీయడం లేదని మండిపడ్డారు. ఆర్థికమైనటువంటి పరిమితులు విధించడం, రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాలైన దుర్మార్గాలకు బిజెపి ప్రభుత్వం ఒడిగడుతా ఉన్నదని, ఇది యావత్ దేశమంతా చూస్తున్నదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది : అరవింద్ కేజ్రీవాల్
కెసిఆర్‌జీ మోడీకి వ్యతిరేకంగా చాలా బలంగా పోరాడుతున్నారని ఢిల్లీ సిఎం కెసిఆర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్సు తెచ్చిందని, ప్రభుత్వ అధికారుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తోందని అన్నారు. హైదరాబాద్ వచ్చిన తమకు కెసిఆర్ సాదరంగా ఆహ్వానం పలికారని తెలిపారు. ఢిల్లీ సర్కార్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కెసిఆర్‌తో చర్చించామని, ఆయన తమకు మద్దతిస్తామని చెప్పారని అన్నారు.అనంతరం కేజ్రీవాల్ మోదీ సర్కార్‌పై,బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును కూడా కేంద్రం లెక్క చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్సు తెచ్చిందని, ఢిల్లీ ప్రజలను మోడీ సర్కార్ తీవ్రంగా అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కూడా బిజెపి అరాచకాలు పెరిగాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో కలిసిరావాలని సిఎం కెసిఆర్‌ను కోరాను. కెసిఆర్ తమకు మద్దతిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇది ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కాదు..యావత్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అని పేర్కొన్నారు. 2015 ఫిబ్రవరిలో మేం మొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, మూడు నెలల్లోనే మోదీ సర్కార్ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసి తమ అధికారాలను లాక్కున్నారని చెప్పారు.

తమకంటే ముందున్న షీలా దీక్షిత్ ప్రభుత్వంలో అధికారులంతా ఆమె నియంత్రణలోనే ఉన్నారని. అధికారుల బదిలీలు, పోస్టింగ్స్, అధికారుల నియంత్రణ, క్రమశిక్షణ చర్యలు, కొత్త పోస్టుల సృష్టి, సర్వీసు సంబంధింత అంశాలన్నీ షీలా దీక్షిత్ నియంత్రణలోనే ఉన్నాయని గుర్తు చేశారు.ఢిల్లీ ముఖ్యమంత్రిగా తనకు కనీసం హెల్త్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ తదితరులను బదిలీ చేసే అధికారం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఢిల్లీలో ప్రభుత్వ అధికారాలన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్లాడి తెచ్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇటీవలే సుప్రీంకోర్టు మెజార్టీ బెంచ్ తమ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నిచ్చిందన్నారు. ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు నిచ్చిందని తెలిపారు.

కానీ ఎనిమిది రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తెచ్చిందని మండిపడ్డారు. ఈ దేశ ప్రధానమంత్రి సుప్రీంకోర్టును, సుప్రీంకోర్టు ఆదేశాలనూ గౌరవించడం లేదని ఆరోపించారు. మరి ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి..? అని ప్రశ్నించారు.
రాజ్యసభలో ఆర్డినెన్స్ పాస్ కాకుండా అడ్డుకుంటాం
ఢిల్లీ ప్రజలను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని, కేవలం ఢిల్లీనే కాదు దేశానికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్త మద్ధతు కోరుతున్నామని చెప్పారు. దేశంలో మోదీ నియంతృత్వం కొనసాగుతోందని, బిజెపియేతర పార్టీల ప్రభుత్వాలను పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. వేరే పార్టీల ఎంఎల్‌ఎలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడి, ఐటీ, సిబిఐలతో వేధింపులు, దాడులు చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వాలను కూల్చుతున్నారని, ఆర్డినెన్స్‌లు తెస్తున్నారని చెప్పారు. గవర్నర్లతో అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాజ్యసభలో బిజెపికి మెజార్టీ లేదని, విపక్షాలన్నీ కలిసి ఈ ఆర్డినెన్స్ బిల్లు పాస్ కాకుండా రాజ్యసభలో అడ్డుకుంటామని తెలిపారు. దీనికి సిఎం కెసిఆర్ మద్ధతును కోరుతున్నామని అన్నారు. మళ్లీ దేశంలో మోదీ ప్రభుత్వం రాకుండా ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తామని తెలిపారు.
మోడీ సర్కార్ గవర్నర్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది : పంజాబ్ సిఎం
ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని పంజాబ్ సిఎం భగవంత్ మాన్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. బిజెపియేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజ్‌భవన్‌లు బిజెపి ఆఫీసుల్లా పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ బిల్లులను ఆపారని, తమ బిల్లులను కూడా ఆపారని చెప్పారుజ సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఫెడరల్ వ్యవస్థ పటిష్టత కోసం తాము పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, బంగాల్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం గొప్పగా చెప్పుకుంటాం.. భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో ఒకే విధానాన్ని బిజెపి ఆశిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News