కరీంనగర్ : కరీం“నగరం”లోని 14.5 కిలో మీటర్ల ప్రధాన రహదారులలో ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తు పనులన్నీ 15 రోజుల్లో పూర్తిచేసి రోడ్లన్నీ తళ తళలాడే విధంగా చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ నగరంలో ఆదివారం బద్దంఎల్లారెడ్డి చౌరస్తాలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో వర్షానికి ధ్వంసమైన బీటీ రోడ్డు నిర్మాణ పనులను 1కోటి 11లక్షలతో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.మరమత్తులన్నీ పూర్తయితే మరో 5సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు.
కరీంనగర్ ప్రజలకు మౌళిక సదుపాయాలుకల్పించి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయం అని అన్నారు.. గతంలో ఎన్నడు లేని విధంగా నగరంలో ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు నిర్మిస్తున్నామని. భారీ వర్షాలతో కొన్ని చోట్ల రహదారులు గుంతలు ,కొన్ని చోట్ల ధ్వంసం కావడంతో ఇట్టి విషయాన్నిప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో భక్తులకు నిధులు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని నూతనంగానిర్మించిన రోడ్లు ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు.
బిటి రోడ్లమీద నీరు నిల్వకుండా మునిసిపల్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.రోడ్లమీద నీరు నిలిస్తే ఎటువంటి బీటీ రోడ్ అయినా ధ్వంసం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ ఈ నాగ మల్లేశ్వర్ రావు,ఆర్&బి ఈఈ సాంబ శివరావు , డిఈ రవీందర్ ,ఏఈ లక్ష్మణ్ రావు,కార్పొరేటర్లు ఐలందర్ యాదవ్ ,గుగ్గిళ్ళ జయశ్రీ -శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్ కుమార్,కొలిపాక శ్రీనివాస్, రవి నాయక్,మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు