Friday, November 22, 2024

జంతర్ మంతర్ వద్ద మళ్లీ రెజ్లర్ల దీక్ష.. అనుమతించని పోలీస్ లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఘర్షణ తలెత్తడంతో అక్కడ నుంచి రెజ్లర్లను పోలీస్‌లు ఖాళీ చేయించి అరెస్టు చేసిస సంగతి తెలిసిందే . ఇప్పుడు అదే చోట రెజ్లర్ల దీక్షకొనసాగించడానికి భద్రతా దళాలు ఒప్పుకోవడం లేదు. గత 38 రోజులుగా అక్కడ ఆందోళన ఎలాంటి ఉద్రిక్తతకు తావు లేకుండా సాగిందని, ఆదివారం మాత్రం ఆందోళనకారులు చట్టాన్ని ఉల్లంఘించారని, మరీమరీ తాము ఎన్ని విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదని , అందువల్ల అక్కడ నుంచి వారిని అదుపు లోకి తీసుకోవలసి వచ్చిందని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు. అందువల్ల ఆ స్థలం ఖాళీ చేయించ వలసి వచ్చిందన్నారు.

రెజ్లర్లు తమ దీక్ష కొనసాగించడానికి అనుమతి కోరినట్టయితే జంతర్ మంతర్ తప్ప మరో చోట వారికి అనుమతి కల్పిస్తామని వివరించారు. ఆదివారం ఘర్షణ తరువాత పోలీస్‌లు జంతర్‌మంతర్‌ను ఖాళీ చేయించారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. ఘర్షణలకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ , బజ్‌రంగ్ పునియాలతో సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మొత్తం 700 మందిని అదుపు లోకి తీసుకున్నామని, వీరిలో ముగ్గురు రెజ్లర్లతోపాటు 109 మంది ఆందోళన కారులను జంతర్ మంతర్ వద్ద అరెస్టు చేసినట్టు పోలీస్‌లు చెప్పారు.

జంతర్‌మంతర్ వద్ద ఆందోళన కారులకు పోలీస్‌లు ఎంతో సహకరించారని, కానీ ఆదివారం సంఘటన వారిని బలవంతంగా జంతర్ మంతర్ నుంచి వారిని ఖాళీ చేయించవలసి వచ్చిందని డిల్లీ పోలీస్ పిఆర్‌ఒ సుమన్ నల్వా చెప్పారు. రెజ్లర్లు మే 17న మార్చ్ నిర్వహించడానికి అనుమతించామని, అలాగే మే 23న కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించామని ఆమె తెలిపారు. అయితే నిన్న వారు చేసింది మాత్రం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆదివారం పార్లమెంట్ కొత్తభవనం ప్రారంభోత్సవం జరుగుతున్నందున ఎలాంటి ర్యాలీలకు అనుమతించబోమని ఆందోళన కారులకు చెప్పామని, కానీ వారు నిరసన ప్రదర్శన చేపట్టారని, మొదటి బ్యారికేడ్ విరగగొట్టారని, రెండో బారికేడ్ కూడా పగుల గొట్టడానికి ప్రయత్నించారని పీఆర్‌ఒ తెలిపారు.

ఆందోళన కారులపై చట్టపరమైన చర్య తీసుకున్నామని, చట్టం ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. రెజ్లర్ల గత చరిత్ర, నిన్న వారి ప్రవర్తన చూసి జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. లిఖిత పూర్వకంగా వారు అభ్యర్థిస్తే వారికి మరో చోట అనుమతిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News