ఈజీ మని కోసం బైక్ దొంగతనాలు
బోడుప్పల్ : బైకు దొంగతనాలు చేసి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ఈజిగా ఉందని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. సోమవారం మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్కాజ్‌గిరి జోన్ ఇంచార్జీ డీసీపి ఆర్. గిరిధర్ ఐపిఎస్ వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గొల్లపూడి చంటి (38) తండ్రి హుస్సేన్ గతంలో ఇతని కాలు ఫ్రాక్చర్ కావడంతో పనిచేయలేక తన భార్య, ఇద్దరు పిల్లలతో బోడుప్పల్ ప్రాంతానికి వచ్చి లక్ష్మీనగర్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో మద్యం సేవించడం, అవి సరపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లిన అతను అనుకున్న ప్రకారం హ్యాండిల్ లాక్ లేని మోటార్ సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఇది ఈజీగా ఉందని భావించిన చంటి మేడిపల్లి, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ల పరిదిలో 13 బైకులు దొంగతనం చేశాడు. అదేవిధంగా కొత్తూరు, షాద్‌నగర్‌కు చెందిన పత్లావత్ గోపాల్ నాయక్ (36) పాతనేరస్థుడు. ఇతనిపై గతంలో షాద్‌నగర్, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లలో పలు కేసులలో అరెస్టు చేసి వదిలేశారు. అక్కడి నుండి జీవనోపాధి కోసం హైదరాబాదుకు వచ్చాడు.
ఇక్కడకు వచ్చాక కూడా చెడు అలవాట్లు, మద్యపానానికి అలవాటు పడి దొంగతనాలు చేయడంతో తుకారాం గేట్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. జైలు నుండి విడుదలైన తన వైఖరి మార్చుకోకుండా మల్కాజ్‌గిరి పరిధిలో రెండు మోటర్ సైకిళ్లు దొంగిలించాడు. నగరంలో జరుగుతున్న ఘటనలను గుర్తించి మేడిపల్లి క్రైమ్ టీం, మల్కాజ్‌గిరి క్రైమ్ టీంలుగా ఏర్పడి అనుమానితులను గుర్తించారు. సోమవారం ఉదయం దొంగిలించిన ద్విచక్ర వాహనం హోండా యాక్టివాపై తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడుని పట్టుకొని విచారిస్తే 13 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పీడియాక్టు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇంతటి చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న మేడిపల్లి, మల్కాజ్‌గిరి క్రైమ్ టీంను డీసిపి గిరిధర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఏసిపి నరేష్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవర్దనగిరి, డీఐ ప్రవీణ్ బాబు, మల్కాజ్‌గిరి డీఐ రవిబాబు, మేడిపల్లి డిటెక్టివ్ ఎస్త్స్ర లక్ష్మణ్, తిరుపతి రెడ్డి, మలాజిగిరి డిటెక్టివ్ ఎస్‌ఐ క్రిష్ణమాల్సురా, కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.