Friday, November 22, 2024

ఢిల్లీ పురానా ఖిల్లా తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన కళాఖండాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పురానా ఖిల్లా ప్రదేశంలో ప్రస్తుతం సాగుతున్న తవ్వకాల్లో బైటపడిన పురాతన కళాఖండాల్లో కుశానా శకానికి చెందిన ఇరుసుతో కూడిన రాగి చక్రం, రాజపుత్ కాలానికి చెందిన బాణం తల( ములికి) మొగలుల కాలం నాటికి చెందిన నాణేలు ఉన్నాయని పురాతత్వ పరిశోధనా సంస్థ(ఎఎస్‌ఐ)కి చెందిన ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు. 2500 ఏళ్లకు పైబడిన చారిత్రక పుటలకుచెందిన గుర్తులు బైటపడిన భారత దేశంలోని అత్యంత అరుదైన పురాతత్వ స్థలాల్లో ఇది ఒకటని ఎఎస్‌ఐ అధికార ప్రతినిధి వసంత్ స్వర్ణకార్ తెలిపారు.

పురానా ఖిల్లా ప్రాంతంలో గత జనవరిలో ప్రారంభమైన తాజా తవ్వకాలకు ఈయన నేతృత్వం వహిస్తున్నారు.16వ శతాబ్ద కాలానికి చెందిన పురానా ఖిల్లా ప్రాంతంలో గతంలో 2013 14,2017 18 సంవత్సరాల్లో రెండు సార్లు తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మూడో సారి తవ్వకాలు జరుగుతున్నాయి.2013 14సంవత్సరాల్లో జరిపిన తవ్వకాల్లో రంగులు వేసిన ఎర్ర మట్టి పాత్రలను కనుగొన్నట్లు ఆయన చెప్పారు. వివిధ ప్రాంతాల్లో కనుగొనబడిన మహాభారత కాలం నాటివిగా భావిస్తున్న మట్టిపాత్రలకు వీటికి సంబంధం ఉందని పురానాఖిల్లా కోట లోపల , చుట్టుపక్కల 1954, 1969 73మధ్య కాలంలో తవ్వకాలు కొనసాగించిన పద్మ విభూషణ్ ప్రొఫెసర్ బిబి లాల్ చెప్పారు. పలు దఫాలుగా జరిపిన తవ్వకాల్లో బైటపడిన ఈ కళాఖండాల్లో మౌర్యుల ముందు కాలంనాటినుంచి మొగలు కాలం దాకా చెందినవి ఉన్నాయని స్వర్ణకార్ చెప్పారు.

పురానాఖిల్లా ప్రాంతంలో తాజాగా జరిపిన తవ్వకాల్లో కుశానా కాలం, రాజ్‌పుత్‌ల కాలం, మొగలులు కాలాలకు చెందిన కళాఖండాలు బైటపడ్డాయని , వాటిలో దాదాపు 5 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఇరుసుతో కూడిన రాగి చక్రం(కుశానా కాలం), రాగి బాణం తల భాగం( రాజ్‌పుత్‌ల కాలం), ఎముక మేకు, ఒక పాత్ర(గుప్తుల కాలం), మొగలుల కాలానికి చెందిన పురాతన నాణేలు ఉన్నాయని ఆయన చెప్పారు.కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అత్యంత ముఖ్యమైన పురాతత్వ ప్రదేశంగా పరిగణిస్తోందని చెప్పారు. రుతుపవనాలు రావడానికి ముందే తవ్వకాల పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పారు.

వచ్చే సెసెంబర్‌లో ఢిల్లీలో నిర్వహించే జి20 శిఖరాగ్ర సదస్సుకు ప్రతినిధులు సందర్శించే ప్రాంతాల్లో పురానా ఖిల్లా కూడా ఉండే అవకాశం ఉందని స్వర్ణకార్ చెప్పారు.గత నెల రోజుల కాలంలో జరిపిన తవ్వకాల్లో ఏ కళాఖండాలైనా బైటపడ్డాయని అడగ్గా కుశానా కాలానికి చెందిన ఇటుక పాట్‌ఫామ్, బట్టీ ఉన్నాయని స్వర్ణకార్ చెప్పారు. కాగా తాజా తవ్వకాల్లో ఆధునిక యుగానికి చెందిన కళాఖండాలేవైనా బైటపడ్డాయా అని అడగ్గా బ్రిటీష్ కాలం నాటి షూపాలిష్ డబ్బా ఒకటి కనుగొన్నట్లు ఆయన చెప్పారు. దీని బ్రాండ్ నేమ్ ‘ ప్యారట్’, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అనేవి బాక్స్‌కు ఓ వైపున ముద్రించి ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇదే కాకుండా పై పొరలో ఒక చిన్నపాటి పింగాణీ శిల్పం, రాతితో చేసిన డ్రెయిన్ మార్గంను కూడా కనుగొన్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News