ముంబయి: జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఫిట్‌నెస్‌పై అవగాహనతో క్రమశిక్షణతో మెలగడం చాలా ముఖ్యమని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. తన తండ్రి సూచన మేరకు ఎప్పుడూ పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేపట్టనని స్పష్టం చేశారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా స్వచ్చ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకంలో భాగంగా సచిన్ టెండూల్కర్‌ను ‘మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్’గా నియమించింది. క్లీన్ మౌత్ ప్రచారం కోసం సచిన్ అయిదేళ్ల పాటు అంబాసిడర్‌గా ఉండనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేతృత్వంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.
అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడారు. మంచి ఆరోగ్యానికి పునాది నోటి ఆరోగ్యమేనని అన్నారు. అలాగే ఫిటెనెస్‌పై అవగాహన కూడా ముఖ్యమని చెప్పారు. ఫిట్‌నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదని, మానసిక ఆరోగ్యం, నోటి శుభ్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఉందని అన్నారు. 50 శాతం మంది చిన్నారులు నోటి సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారని, అవి వారి జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.
Also Read: గంగపాలు కానున్న రెజ్లర్ల పతకాలు