హింసతో అట్టుడుకుతున్న మణిపూర్… ప్రశాంతత నెలకొనేలా జోక్యం చేసుకోండి
రిటైర్డ్ సుప్రీం జడ్జీతో దర్యాప్తు.. ఉగ్రవాదుల్ని కేంద్రం అదుపు చేసేలా చర్యలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ, మెమోరాండం సమర్పణ
న్యూఢిల్లీ: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొనేలా జోక్యం చేసుకుని సహకరించాలని, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేసి ఆయా సంఘటనలపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అగ్రస్థాయి నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మంగళవారం అభ్యర్థించారు. ఈమేరకు వీరంతా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ పతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి మెమోరాండం సమర్పించారు. మణిపూర్ హింస నివారణకు తక్షణమే కల్పించుకోవాలని అభ్యర్థించారు. మెమోరాండంలో మొత్తం 12 అంశాలతో డిమాండ్ల జాబితా పేర్కొన్నారు. మణిపూర్‌లో హింసను మొదట్లోనే నివారించడంలో వైఫల్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పులు వేలెత్తి చూపడానికి తగిన సమయం
కాదని తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సూచనలన్నీ సత్వరం అమలు చేయించగలిగితే శాంతివాతావరణం మళ్లీ నెలకొంటుందని సూచించారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితి, సామాజిక సమష్టి పునరుద్ధరణకు ఎలాంటి చొరవ తీసుకున్నా బాధ్యతాయుతమైన పార్టీగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. అయితే రాజ్యాంగపరమైన ఉన్నతస్థాయి దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్‌ఒఒ) పరిధిలో ఉన్న గ్రూపులతో సహా మొత్తం ఉగ్రవాద ముఠాలను అదుపు చేయడానికి, నిరోధించడానికి వీలైనంతవరకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని అభ్యర్థించారు.
ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగ పరమైన ప్రయోజనాలన్నీ పరిరక్షించాలని, చర్చల ద్వారా సయోధ్య ద్వారా, సామాజిక వర్గాల మధ్య విశ్వాసం కల్పించాలని కోరారు. ఎంతో ఆవేదనతో తాము ఈ మెమోరాండాన్ని సమర్పిస్తున్నామని, దయతో మీరు జోక్యం చేసుకుంటే అక్కడ పరిస్థితి యథా ప్రకారం సాధారణ స్థితికి వస్తుందని కాంగ్రెస్ రాష్ట్రపతికి సమర్పించిన మెమోరాండంలో అభ్యర్థించింది. రాష్ట్రపతిని కలిసిన ప్రతినిధి బృందంలో మాజీ సిఎం ఐబోబి సింగ్, ముకుల్ వస్నిక్, మాజీ డిప్యూటీ సిఎం గైఖంగామ్, పిసిసి అధ్యక్షులు కేయిషాం మేఘచంద్రసింగ్, మణిపూర్ ఎఐసిసి ఇన్‌చార్జి భక్త చరణ్ దాస్ ఉన్నారు.