హైదరాబాద్: బేగంపేట రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కే క్రమంలో పడిపోతున్న మహిళా ప్రయాణికురాలు సరస్వతిని అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ కె. సనిత సమయ స్పూర్తితో కాపాడి పలువురి అభినందనలు అందుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవీ.. – లింగంపల్లి – ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు (నంబర్ 47176) మంగళవారం ఉదయం 09:00 గంటలకు సాధారణ రద్దీ మధ్య బేగంపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
బేగంపేటలో రైలు కదులుతున్న సమయంలోనే ఎక్కేందుకు యత్నించిన ఆ మహిళ రైలు కదులుతున్న క్రమంలో రైలును ఎక్కలేక.. దిగలేక కొద్ది దూరం లాక్కెళ్లడం గమనించిన కానిస్టేబుల్ సనిత చాలా చాకచక్యంగా ఆ మహిళను రైలు కదలికల నుండి తప్పించి ప్రాణాలను కాపాడింది. ప్రయాణీకులు కదులుతున్న రైలులో ఎక్కడానికి/దింపే ప్రయత్నంలో జారిపడి రైలు చక్రాల కిందకు వచ్చే ప్రమాదం ఉన్న సంఘటనలు గతంలోనూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా మిషన్ జీవన్ రక్ష కింద ఆర్ పి ఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి 2023 సంవత్సరంలో ఇద్దరి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన విషయాన్ని వారు ఉదహరించడం గమనార్హం. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ కె . సనిత సమయానుకూల స్ఫూర్తితో రైలు ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిందని సనీతను ఈ సందర్బంగా అభినందించారు . ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలను జనరల్ మేనేజర్ ప్రశంసించారు. ఇటువంటి చర్య లు తమ రైల్వే రక్షణ దళం యొక్క నైతికతను పెంచడమే కాకుండా ఇతర రైల్వే సిబ్బందిని కూడా అలాంటి ప్రయత్నాలను చేపట్టేలా ప్రోత్సహిస్తుందని అన్నారు