Monday, December 23, 2024

మీరే నా బలం.. మీరే నా బలగం

- Advertisement -
- Advertisement -

నారాయణరావుపేట: మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా… మరింత సేవ చేస్తా.. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బోర్లు వేసినా నీళ్లు పడక బాధపడ్డారని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో ఆ బాధ తప్పిందని, ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనదని మంత్రి హరీశ్ వెల్లడించారు.

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో గురువారం అభివృద్ధి కార్యక్రమాలలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి హాజరై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కల్యాణ మండపం సభ సమావేశంలో మాట్లాడారు. మల్యాల గ్రామానికి గ్రామస్తుల సహకారంతో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటు వైపున చూసినా గ్రామ రూపురేఖలు మారిపోయాయని, గల్లీ, గల్లీలో సీసీరోడ్లు వేసుకున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అయ్యాక అవ్వ, తాతల గౌరవం పెరిగింది. తెలంగాణ రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా అంటూ.. గత గ్రామ అనుభవాలు గుర్తు చేసి, ఇవాళ జరిగిన గ్రామ అభివృద్ధిని వివరించారు. కాళేశ్వరం నీళ్లతో మండుటెండలలో చెరువులు నిండు కుండలుగా తలపిస్తున్నాయని వివరించారు. ఎవ్వరైనా సరే సద్దితిన్న రేపు తలవాలని కోరారు. రూ.200 పింఛన్ రూ.2 వేలు చేశామని, మరో వారం రోజుల్లో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని తెలిపారు.

పుట్టబోయే బిడ్డకు న్యూట్రీషన్ కిట్, పుట్టిన బిడ్డకు ఇచ్చేది కేసీఆర్ కిట్. ఇది కేసీఆర్ కు ప్రజల మీద ఉన్న ప్రేమగా మంత్రి చెప్పుకొచ్చారు. గతంలో బోరు బావులు తవ్వి డబ్బులు వృథా చేసుకున్నారని, ఇవాళ కాళేశ్వరం నీటితో రెండు పంటలు పండించుకుంటున్నామని నాటి-నేటి పరిస్థితి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత ఉండేదని, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్, ఎరువులు తదితర రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం తలపెట్టిన అంశాలు వివరించారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొదటి విడతలో 40-50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ లైబ్రరీకి వారంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానని హామీనిచ్చారు. గ్రామంలో  808 రైతులకు రైతుబంధు, అనివార్య కారణాలతో మృతి చెందిన 14 మంది రైతు కుటుంబాలకు రైతుభీమా ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. గ్రామంలో ఇటీవల శిక్షణ పొందిన 21 మందికి కుట్టు మిషన్లు త్వరలోనే అందిస్తామని మంత్రి హామీనిచ్చారు. అంతకుముందు 30 రోజుల ప్రణాళికతో మంత్రి సహకారంతో మల్యాల గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని గ్రామ ప్రజాప్రతినిధులు వివరించారు. గ్రామంలో 18 రకాల అభివృద్ధి పనులు చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News