Monday, December 23, 2024

మిస్సింగ్ పోస్టర్‌పై స్మృతి ఇరాని కన్నెర్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాను కనిపించడం లేదంటూ గుర్తు తెలియని వ్యక్తులు వేసిన పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తన పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీలోనే ఉన్నానని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అమేథీ మాజీ ఎంపి రాహుల్ గాంధీ కోసం వెతుకుంటే ఆయన అమెరికాలో దొరుకుతారంటూ స్మృతి ఇరాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ షేర్ చేసిన తన పోస్టర్‌కు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని స్పందిస్తూ తాను ఇప్పుడే అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సలోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సిర్సిం గ్రామం నుంచి ధురన్‌పూర్‌కు బయల్దేరానని, మీ మాజీ ఎంపి కోసం వెదుకుతుంటే ఆయనను అమెరికాలో సంప్రదించాలంటూ కాంగ్రెస్‌కు జవాబిచ్చారు.

ఇలా ఉండగా మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు నెట్టా డిసౌజా కేంద్ర మంత్రి స్మృతి ఇరానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది బాలికలు మీ కోసం అనేక నెలలుగా ఎదురుచూస్తున్నారని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయిన మీరు ఒకసారి వారిని కలుసుకోవాలని ఆమె స్మృతి ఇరానికి పిలుపు ఇచ్చారు.

మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై మంత్రి మౌనం దాల్చడాన్ని ఆమె ప్రస్తావిస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు గత ఆదివారం బలవంతంగా గెంటివేశారని డిసౌజా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News