ఆపరేషన్ గోల్డ్
నడి సముద్రంలో 32 కిలోల బంగారం స్వాధీనం
అధికారులను చూసి 11 కిలోల బంగారాన్ని సముద్రంలో పడేసిన స్మగ్లర్లు
రెండు రోజుల ఆపరేషన్ తర్వాత వెలికి తీసిన వైనం
చెన్నై: తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తులు రెండు పడవల్లో శ్రీలంకనుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా, కోస్టు గార్డు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్(డిఆర్‌ఐ), కస్టమ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మొత్తం 32 కిలోల బంగారం పట్టుబడింది. ఈ బంగారం విలువ రూ.20.20 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఒక పడవలోని స్మగ్లర్లు అధికారులను చూడగానేభయంతో 11 కిలో బంగారాన్ని సముద్రంలో పడేశారు. అయితే రెండు రోజలు గాలింపు అనంతరం అధికారులు ఈ బంగారాన్ని కనుగొన్నారు. మరో పడవలో 21 కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు ఘటనల్లో రూ.20 కోట్లకు పైగా విలువ కలిగిన 32.60 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ ఒక ప్రకటనలో తెలియజేసింది. కొంతమంది స్మగ్లర్లు శ్రీలంకనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో కోస్టుగార్డు , కస్టమ్స్ అధికారులతో కలిసి నిఘా పెట్టారు. ఈ క్రమంలో మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలో రెండు పడవల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని వెంబడించగా తప్పించుకునే క్రమంలో ఒక పడవలోని ముగ్గురు సగ్లర్లు తమ వద్ద ఉన్న ఉన్న 11.6 కిలోల బంగారం కడ్డీలను సముద్రంలో పారవేశారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డైవర్లను రంగంలోకి దింపి సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికితీశారు. మరో పడవలోని 21 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.