Monday, December 23, 2024

2024 ఎన్నికల్లో ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికాలో మూడు నగరాల పర్యటనలో ఉన్నారు. ప్రతిపక్షాల ఐక్యత 2024 ఎన్నికల ఫలితాలతో ప్రజలని ఆశ్చర్యపరుస్తాయి అన్నారు. ఆయన గురువారం వాషింగ్టన్‌లో నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మాటామంతీ జరుపుతూ ఈ విషయం చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత బలంపై ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు. ‘వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరును కనబరచనున్నది. లోలోన శక్తి పుంజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని నేననుకుంటున్నాను’ అని రాహుల్ గాంధీ అన్నారు.

భారత్‌లో ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతూ ‘భారత్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు మరింత ఐక్యం అవుతున్నాయి. మేము అన్ని ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నాము. చాలా మెరుగైన పని జరుగుతోంది’ అన్నారు.
సారూప్య భావజాలం ఉన్న అనేక ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలన్న ఏకైక లక్షంతో పనిచేస్తున్నాయి. చాలా వరకు ప్రతిపక్షాలు బిజెపితో తలపడనున్నాయి. ఈ ఒకే భావజాలం ఉన్న ప్రతిపక్ష పార్టీలు జూన్ 12న పాట్నాలో సమావేశం అవుతున్నాయి. ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షత వహిస్తారు.

కర్నాటకలో కాంగ్రెస్, బిజెపిని చిత్తుచేయడంపై మాట్లాడుతూ ‘మరో మూడునాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం ఎదురుచూడండి. అవన్నీ మంచి శుభ సూచనలిస్తాయి’ అన్నారు. ‘మేమంతా ఒక్కటై బిజెపి, దాని మిత్రపక్షాలతో తలపడుతున్నాము. ఈ నేపథ్యంలో ఇచ్చిపుచ్చుకోవడంకు అవకాశం తక్కువ. అయితే ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతాయన్న నమ్మకం నాకుంది’ అన్నారు రాహుల్. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు ప్రధాని నరేంద్ర మోడీకి మన్ననలు ఇవ్వడం, ఆయన ప్రాచుర్యం పెరగడం గురించి మాట్లాడుతూ ‘ఆయన భారత్‌లోని అన్ని వ్యవస్థలను లోబరుచుకున్నారు. దేశంలో పత్రికా రంగాన్ని చేజిక్కించుకున్నారు. మీరనుకున్న దాన్ని నేను ఆమోదించలేను. ఆయన గురించి వింటున్నదంతా నేను నమ్మను’అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘భారత్‌లో పత్రికా స్వేచ్ఛ బలహీనపడుతోంది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా కీలకం’అని స్పష్టం చేశారు.
‘నేను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలతో కలిసి నడిచాను. లక్షలాది మంది భారతీయులతో కలిసిమెలిసి మాట్లాడాను. వారంతా సంతోషంగా లేరు. చాలా మంది పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారు. ప్రజల్లో ఓ రకమైన ఉక్రోషం ఉంది’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News