న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పదో అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము తన ట్విట్టర్‌లో తెలంగాణ ప్రజలకు గ్రీటింగ్స్ తెలియజేస్తూ , రాష్ట్రంలో అడవులు, వన్యప్రాణులు సుసంపన్నంగా ఉన్నట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో నైపుణ్యవంతులైన ప్రజలు ఉన్నారని, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం కూడా సంపన్నమైనదని ఆమె అన్నారు.
అద్భుతమైన తెలంగాణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కరణలకు నిలయంగా మారుతోందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అనునిత్యం అభివృద్ధి పథంలో సాగాలని ఆమె ఆకాంక్షించారు. ప్రధాని మోడీ కూడా తన ట్విట్టర్‌లో తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రప్రజల నైపుణ్యం, సంస్కృతీ వైభవానికి ఎంతో విశేషమైన గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు ఆయన తన ట్వీట్‌లో వెల్లడించారు.