ఖమ్మం : కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సుపరిపాలన కోసం మనమంతా కలిసి మంచి నిర్ణయం తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో అవతరణ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.అనంతరం పొంగులేటి మాట్లాడుతూ ఎంతో మంది యోధులు, యువకులు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఇలా అనేక వర్గాలకు చెందిన వారంతా కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మన కలలు అని కల్లాలుగానే మిగిలిపోయ్యయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వామ్యులైన ఉద్యమకారులకు న్యాయం చేయకపోగా వారిపై అక్రమ కేసులను బనాయించి నేటికి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అడుగులకు మడుగులు ఒత్తేటోళ్లకే పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా ఆయన పలువురు తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోటా రాంబాబు, విజయబాయి, మద్దినేని బెబి స్వర్ణకుమారి, కార్పోరేటర్లు జగన్, రవి తదితరులు పాల్గొన్నారు.