హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తర తెలంగాణ సెగలు చిమ్ముతోంది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46డిగ్రీలకు పైగానే నమొదువుతున్నాయి. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యనంబైలులో 46.4డిగ్రీలు నమోదయ్యాయి. కొమరంభీమ్ జిల్లా జండుగలో 46.1,ములుగు జిల్లా తాడ్వాయ్‌లో 46, మహబూబాబాద్ జిల్లా పెద్దనగరంలో 46, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపట్నంలో 46, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 45.9 సూర్యాపేట జిల్లా మునగాలలో 45.8,నల్లగొండ జిల్లా దామచర్లలో 45.8, కొమరంభీమ్ జిల్లా కుంచెవెళ్లిలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒక మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి. దక్షిణ చత్తిస్‌గఢ్ , దాని పరిసరాల్లోని తెలంగాణ మీద ఒక ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి0.9 కి.మి ఎత్తు వద్ద ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజలు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. రాగల ఏడు రోజులు తెలంగాణ రాష్ట్రమంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు 42నుండి 44డిగ్రీల వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో రాగల 48గంటల్లో 39నుండి 41డిగ్రీల ఉష్ణొగ్రతలు నమోదుకు అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.