Saturday, November 23, 2024

ఎదురులేని స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

ఎదురులేని స్వియాటెక్
గాఫ్, రూడ్ ముందంజ
పారిస్: టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో రౌండ్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో 6-0, 6-0 తేడాతో చైనాకు చెందిన వాంగ్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే ఇగా దూకుడును ప్రదర్శించింది. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడింది. అసాధారణ ఆటతో అలరించిన ఇగా ఏ దశలోనూ వాంగ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో అమెరికా యువ సంచలనం, ఆరో సీడ్ కొకొ గాఫ్ మూడో రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించింది.

రష్యాకు చెందిన మిర్రా అండ్రివాతో జరిగిన మ్యాచ్‌లో గాఫ్ 6-7, 6-1, 6-1తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఈ సెట్‌లో గాఫ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో చివరికి అండ్రివా విజయం సాధించింది. కానీ తర్వాతి సెట్‌లో గాఫ్ పుంజుకుంది. అద్భుత ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను దక్కించుకుంది. ఈ విజయంతో గాఫ్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇదిలావుంటే నాలుగో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. గాయంతో రిబకినా బరిలోకి దిగలేదు. దీంతో స్పెయిన్ క్రీడాకారిణి సొరిబెస్ టొర్మొకు వాకోవర్ లభించింది.

ప్రీక్వార్టర్స్‌లో రూడ్, రూనే
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఆరో సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్) ప్రీక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. జపాన్‌కు చెందిన 27వ సీడ్ యోషిహిటో నిషియోకా కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. అయితే క్రొయేషియాకు చెందిన 15వ సీడ్ బొర్నా కొరిక్ మూడో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. అర్జెంటీనాకు చెందిన టమస్ మార్టిన్ 6-3, 7-6, 6-2తో కొరిక్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన మార్టిన్ వరుసగా మూడు సెట్లు గెలిచి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు హోరాహోరీగా సాగిన ఐదు సెట్ల సమరంలో యోషిహిటో 3-6, 7-6, 2-6, 6-4, 6-0 తేడాతో బ్రెజిల్‌కు చెందిన థియాగో వైల్డ్‌ను ఓడించాడు.

థియాగో ఇంతకుముందు అగ్రశ్రేణి ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇక నిషియోకాతో జరిగిన మ్యాచ్‌లో కూడా హోరాహోరీగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలావుంటే రూనే మూడో రౌండ్‌లో అలవోక విజయం సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు ఒలివేరితో జరిగిన పోరులో రూనే 6-4, 6-1, 6-3తో జయకేతనం ఎగుర వేశాడు. ఇక రూడ్ 4-6, 6-4, 6-1, 6-4తో చైనాకు చెందిన జాంగ్‌ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో చిలీకి చెందిన నికోలస్ జారీ విజయం సాధించి ప్రీక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News