లక్నో: నవ దంపతులు పెళ్లైన మరునాడే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్పకు మే 30న మంగళవారం రాత్రి పెళ్లయింది. పెళ్లి తర్వాత కొత్త జంట బుధవారం వరుడి ఇంటికి చేరుకున్నారు. రాత్రి ఒకే గదిలో ఆ జంట కలిసి నిద్రించింది. అయితే గురువారం మధ్యాహ్నం వరకు ఆ జంట గది నుంచి బయటకు రాలేదు. అనుమానించిన వరుడి కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్లారు. పెళ్లైన్ జంట చనిపోయి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఆ ఇంటికి చేరుకున్నారు. నవ దంపతుల మృత దేహాలను తర్వాత అటాప్సీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వారిద్దరూ గుండెపోటుతో మరణించినట్లు పోస్ట్‌మార్టంలో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు. వారు నిద్రించిన గదిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. జంట శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు, పైగా వారి గదిలోకి బలవంతంగా ఎవరూ వెళ్లిన ఆనవాళ్లు కనిపించలేదు. నవ జంట ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా మారింది. దీనికి కారణం ఏమిటనది వైద్య నిపుణుల ద్వారా తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
ఇదిలావుండగా నవదంపుతులైన ప్రతాప్, పుష్పకు గ్రామంలోని ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. దీనిని చూసేందుకు అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు.