కోల్‌కతా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతులకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ అందజేసిన గణాంకాలు నమ్మశక్యంగా లేవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటూ ఒక్క తమ రాష్ట్రంనుంచే 61 మందిచనిపోగా, మరో 182 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదన్నారు. అంతేకాదు, వందేభారత్ రైలు ఇంజన్లు ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయా అన్న అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ రాష్ట్ర సెక్రటేరియట్‌నబన్నాలో విలేఖరుల సమావేశంలో మమత మాట్లాడుతూ ‘ ఒక్క రాష్ట్రంనుంచే 182 మంది జాడతెలియకుండా, 61 మంది చనిపోతే ఆ లెక్కలు నిజమైనవా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు.
ఒడిశాలోని బాలసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది చనిపోగా, 1,175 మంది గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రాధాన్యతనుంచి పక్కకి తోసేశారని ఆమె అంటూ, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్లు ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు.అత్యంత విషాదకర పరిస్థితిలో తాను ఇలా మాట్లాడే పరిస్థితిని బిజెపి కల్పించిందని మమత అంటూ, తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే నితీశ్‌కుమార్, లాలూప్రసాద్‌లు రైల్వే మంత్రులుగా ఉన్న సమయంలో చాలా మంది చనిపోయినట్లు కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు.
తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను, ప్రమాదాలు జరక్కుండా నిరోధించే వ్యవస్థను రైల్వేలో ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె అన్నారు.‘ వందేభారత్ పేరు బాగుంది. అయితే ‘ఒక చెట్టు కొమ్మ దానిపై పడితేనే ఏమయిదో చూశారు కదా?’అని ప్రశ్నించారు. పూరి హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టిన రెండో రోజే జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.