న్యూఢిల్లీ : సెల్‌ఫోన్ ద్వారా మిస్సెజ్ పంపిస్తే ఇకపై వాతావరణ హెచ్చరికలు టీవీ తెరపై , రేడియోలలో వెలువడుతాయి. సంబంధిత ఏర్పాట్లను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) ఇటీవలే చేపట్టింది. ఏ ప్రాంతంలో అయినా తీవ్రస్థాయిలో వాతావరణ పరిస్థితులు నెలకొంటే ఆయా ప్రాంతాల వారిని తక్షణం హెచ్చరించేందుకు వీలుగా ఈ ఫోన్ అలర్ట్‌లు పనికి వస్తాయి. భారీ వర్షసూచన లేదా ఈదురుగాలులు, వడగాడ్పులు వంటి వాటి గురించి ఎన్‌డిఎంఎ టీవీలకు , రేడియోలకు పంపిస్తుంది. వెంటనే ఇవి తమ పాటలు , వినోదాత్మక కార్యక్రమాలను నిలిపివేసి కొద్ది నిమిషాలు ఈ వాతావరణ హెచ్చరికలను ప్రజలకు తెలియచేస్తాయి. ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని ఇటీవలే ప్రారంభించారు.
దీనిని మరింత విస్తరించేందుకు, అత్యవసర పరిస్థితిని ప్రజలకు టీవీ, రేడియా ఇతర మాధ్యమాల ద్వారా తెలియచేసేందుకు వీలేర్పడుతుందని అధికారులు తెలిపారు. ఎస్‌ఎంఎస్ పద్థతిలో సాంకేతిక సమాచారం అన్వయించుకుని ప్రజోపయోగ రీతిలో ఉండేలా ఈ సందేశం పద్ధతిని వాడుకలోకి తీసుకువస్తారు. ప్రజలలో బహుళ ప్రచారం పొందిన టీవీల ద్వారా ఈ అలర్ట్‌ను వెలువరించడం వల్ల ప్రజలు తక్షణం వీటిని చూసేందుకు వీలేర్పడుతుంది. అయితే కేవలం అధికారిక సంస్థలు ఈ ఎస్‌ఎంఎస్‌లను పంపించాలా? లేక వాతావరణ విషయాల నిపుణులు కూడా తమ విశ్లేషణకు వచ్చిన అంశాలను తెలియచేయవచ్చా? టీవీలు , రేడియోలు వెనువెంటనే ఈ సందేశాలను ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయా? అనేది స్పష్టం కాలేదు.