Saturday, November 23, 2024

అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

ప్రత్యేకమైన సాంస్కృతిక విశిష్టత, వైవిధ్యం, వారసత్వ సంపద, చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో విలీనం అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం, సామాజిక వెనుకబాటుకు, సాంస్కృతిక అవమానాలకు వ్యతిరేకంగా సుమారు ఆరు దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 02 జూన్ 2014 రోజున ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీని స్థాపించి, అన్ని పార్టీలను కలుపుకపోయి, సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారుడు, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి హృదయ పూర్వక అభినందనలు.

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సిద్ధాంతకర్త జయ శంకర్ చేసిన కృషిని, తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవదు. తెలంగాణ ఉద్యమం ఎగిసినప్పుడల్లా తాయిలాలు ఇచ్చి, బుజ్జగింపు చర్యలతో 60 ఏళ్ల పాటు ఎన్నిసార్లు అణగదొక్కినా, ప్రజలను చైతన్యపరిచి, తెలంగాణ భావజాలాన్ని పదిలపరిచి, నివురగప్పిన నిప్పులా ఉన్న ఉద్యమానికి ఊపిరిలూదిన కవులు, కళాకారులు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో పోరాడిన కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, విద్యార్థులు, అడ్వకేట్లు, సబ్బండ వర్ణాలు ఏకమై చేసిన పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ కీర్తి దశదిశలా తెలియజేస్తూ దశాబ్ది ఉత్సవాలు పండుగలా నిర్వహించడం హర్షించదగ్గ విషయం. గత 9 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి ద్వారా రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ప్రయనిస్తున్న సమయంలో సాధించిన ప్రగతిని ఒకసారి అవలోకనం చేసుకోవాలి. అకాల వర్షాలు, కరువు కాటకాలు, రైతు ఆత్మహత్య లు, వలసలు, ఫ్లోరోసిస్ సమస్య, కరెంటు తిప్పలు, సాంస్కృతిక విధ్వంసం మొదలైన సమస్యలతో ఉన్న తెలంగాణలో ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతున్నది.

నీళ్లు లేక పల్లేర్లు మొలుస్తున్న భూముల్లో కాళేశ్వరం నీటి ద్వారా అత్యధికంగా వరిని పండించి దేశానికే అన్నపూర్ణగా నిలుస్తున్నది. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను వలస పాలకులు నిర్లక్ష్యం చేయడంతో వ్యవసాయానికి నీళ్లు లేక నేలలు నెర్రబారిన సందర్భంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడం, పునర్ నిర్మించడం ద్వారా సాగునీటితో పాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగగా గుర్తించడం, స్థానిక దేవాలయాలు, గిరిజన, గిరిజనేతర జాతరలను గుర్తించడం సాంస్కృతిక విజయం. రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎవరిపై ఆధారపడకుండా రైతుబంధు పథకం, రైతులు ఏ కారణం చేత మరణించినా ఆ కుంటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించడం దేశంలోనే ప్రప్రథమం. బడుగు బలహీన వర్గాలకు దళిత బంధు, బిసిలకు లక్ష రూపాయల రుణం వారికి ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది. నిరంతరాయంగా విద్యుత్, కొన్ని కులవృత్తిదారులకు, రైతులకు ఉచిత కరెంటు సదుపాయం చెప్పుకోదగినవి. బస్తీ దవాఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందుతుంది.

పల్లెపల్లెకు రోడ్లు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ద్వారా పల్లెలు శోభరిల్లుతున్నాయి. తెలంగాణకు హరితహారం ద్వారా పశుపక్ష్యాదులకు ఆవాసం దొరకడంతో పాటు అడవుల విస్తీర్ణం పెరిగి పర్యావరణ పరిరక్షణ జరగడం అభినందనీయం. వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, బిడి కార్మికులకు, చేనేత కార్మికులకు, వృద్ధులకు అందిస్తున్న పెన్షన్లు వారికి ఎంతో సహాయకారిగా నిలుస్తున్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల వల్ల పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా బాల్య వివాహాలు కూడా తగ్గాయి. కెజి టూ పిజి ఉచిత విద్య వల్ల బడుగు బలహీన వర్గాలకు మంచి విద్య అందుబాటులోకి వచ్చింది. ఇందుకు గురుకులాలు సాధిస్తున్న విజయాలే నిదర్శనం. ఫ్రెడ్లీ పోలీసింగ్ ద్వారా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. 33 జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చి సుపరిపాలన జరుగుతున్నది. కవులు, కళాకారులను, కళలను, యాసభాషలను గౌరవించడం సాంస్కృతిక విజయంగా చెప్పవచ్చు.

బొల్లం బాలకృష్ణ, 9989735216

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News