కాలం చెల్లినదని, దేశంలోని ప్రజాస్వామిక వాతావరణానికి బొత్తిగా పొసగనిదని గట్టిగా భావించి సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించిన రాజద్రోహ చట్టాన్ని మరింత కఠినం చేసి అమల్లోకి తేవాలని లా కమిషన్ సిఫారసు చేయడాన్ని బిజెపి పాలకుల రాచరిక నియంతృత్వ పోకడకు గట్టి నిదర్శనంగా పరిగణించవచ్చు. కొత్త పార్లమెంటు భవనంలో రాజదండాన్ని ప్రతిష్ఠించిన పాలకులు అందుకు అనుగుణంగా భారతీయ శిక్షాస్మృతి(ఐపిసి)లోని 124ఎ సెక్షన్‌ను కఠినతరం చేస్తూ తిరిగి అమల్లో పెట్టాలని సంకల్పించినట్టు ఈ సిఫారసు స్పష్టం చేస్తున్నది. ఐపిసిలో 124ఎ సెక్షన్ 153 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పాలనలో వచ్చి చేరింది. బ్రిటిష్ పాలకులు 2009లో అక్కడ ఈ సెక్షన్‌ను రద్దు చేసుకొన్నారు. రాజద్రోహం, పరువు నష్టం అనేవి గత కాలపు అవశేషాలని, భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటి మాదిరిగా ఒక ప్రధానమైన హక్కుగా లేని రోజుల్లో వచ్చినదని దానిని రద్దు చేసిన సందర్భంగా పేర్కొన్నారు.
రాజకీయ అసమ్మతిని అణచివేయడానికి, స్వేచ్ఛను అరికట్టడానికి మాత్రమే ఇటువంటి సెక్షన్లను గతంలో ఉపయోగించారని కూడా పేర్కొన్నారు. మనం సామ్రాజ్యవాదులుగా పరిగణించిన బ్రిటిష్ పాలకులే రద్దు చేసిన రాజద్రోహ సెక్షన్‌ను మరింత పదును పెట్టి అమల్లోకి తేవాలని ఇక్కడి బిజెపి పాలకులు సంకల్పించడం కంటే దురదృష్టం మరొకటి లేదు. ఆర్టికల్ 19(1) (ఎ) ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను కల్పిస్తూనే ఆర్టికల్ 19(2) ద్వారా దానికి పరిమితులు కూడా రాజ్యాంగం విధించింది. ఈ రెండవ దానిని ఉపయోగించుకొని రాజద్రోహ చట్టాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే సుప్రీంకోర్టు 2022 మే లో ఒక ఉత్తర్వును జారీ చేస్తూ ఇది కాలం చెల్లిన సెక్షన్ అని, ప్రజాస్వామ్య వాతావరణానికి బొత్తిగా అనుకూలమైనది కాదని అభిప్రాయపడింది. దీని కింద కొత్తగా ఎటువంటి నేరారోపణలు చేయరాదని, కేసులు పెట్టరాదని, ఈ సెక్షన్ కింద అరెస్టులు జరపరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఈలోగా ఈ సెక్షన్‌ను పునః పరిశీలించవలసిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ సెక్షన్ కింద జామీనుకి ఆస్కారం లేని నేరంగా పరిగణించి కనీసం మూడేళ్ళ శిక్షగాని, యావజ్జీవం గాని విధించవచ్చు. లా కమిషన్ కనీస శిక్షను ఏడేళ్ళకు పెంచాలని సిఫారసు చేసింది. ఈ నెల 3న లా కమిషన్ విడుదల చేసిన తన 279వ నివేదికలో ఈ సిఫారసులను చేర్చింది. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేసిన బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో పరిస్థితులకు, మన దేశంలోని పరిస్థితికి తేడా వుందని కమిషన్ అభిప్రాయపడింది. 1962లో కేదార్ నాథ్ సింగ్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాజద్రోహ చట్టానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేంద్రం దానినే ఆసరా చేసుకొని ఈ చట్టం కొనసాగింపుకి అనుగుణంగా వాదిస్తున్నది.
కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అధ్యక్షతన గల లా కమిషన్ కేదార్ నాథ్ కేసు తీర్పుకి అనుగుణంగా రాజద్రోహ చట్టాన్ని సవరించాలని సిఫారసు చేయడం మారిన దేశ కాల పరిస్థితులను, ప్రజల్లో పెరుగుతున్న ప్రజాస్వామిక చైతన్యాన్ని బొత్తిగా దృష్టిలో పెట్టుకోలేదని బోధపడుతున్నది.మాటల ద్వారా గాని, రాత పూర్వకంగా గాని, సైగల ద్వారా గాని, ప్రదర్శన ద్వారా గాని, ఇతరత్రా గాని విద్వేషాన్ని, ధిక్కారాన్ని రెచ్చగొట్టే వారిని, హింసను ప్రేరేపించే లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వైఖరి గలిగిన వారిని ప్రభుత్వం 124ఎ కింద శిక్షించవచ్చునని ఈ కమిషన్ స్పష్టం చేస్తున్నది. ఈ సెక్షన్‌ను ఏమి చేయాలో సెలవు ఇవ్వవలసిందిగా 2016 మార్చిలో కేంద్రం లా కమిషన్‌కు నివేదించింది. వాస్తవానికి ఉపా చట్టంలో, రాజద్రోహ శాసనం లోని అన్ని శిక్షలు వున్నాయి.
దాని కింద అరెస్టు చేసిన వారిని ఏళ్ళ తరబడి జైలులోనే వుంచుతున్నారు. రాజద్రోహ చట్టంలో ప్రత్యామ్నాయ శిక్షను మూడేళ్ళ నుంచి ఏడేళ్ళకు పెంచాలని లా కమిషన్ చేసిన సిఫారసుకు మించి ఉపా కింద నిరవధికంగా జైలు నిర్బంధంలో వుంచుతున్నప్పుడు 124ఎ ఇక బొత్తిగా అనవసరమే. అయినా దాని కోరలను మరింతగా పదును పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తూ వుండడం దాని ఫాసిస్టు దాహాన్ని చాటుతున్నది. రాజద్రోహ శాసనాన్ని పునః సమీక్షించే ప్రక్రియ కొనసాగుతున్నదని, చివరి దశల్లోనున్నదని పార్లమెంటు వచ్చే వర్షాకాల సమావేశాల నాటికి ఒక కొలిక్కి రావచ్చునని గత మే 1న సుప్రీంకోర్టుకి కేంద్రం నివేదించింది. దీనిని బట్టి లా కమిషన్ తాజా సిఫారసుల మేరకు రాజద్రోహ చట్ట సవరణ మరింత పదునుతో త్వరలోనే పార్లమెంటు ముందుకు రావచ్చునని బోధపడుతున్నది. సుప్రీంకోర్టు ఎంతటి సదుద్దేశంతో ఈ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేసిందో అందుకు విరుద్ధంగా అంతకు మించిన దురుద్దేశంతో దానిని తిరిగి అమల్లోకి తేవాలని కేంద్రం కోరుకొంటున్నది.