కృష్ణా నదిలో ఈతకెళ్లి మృతి
సెలవుల కోసం మేనత్త ఇంటికెళ్లి తిరిగిరాని లోకాలకు
జోగులాంబ గద్వాల జిల్లా మంగపేట శివారులో విషాదం
మన తెలంగాణ/ఇటిక్యాల: మేనత్త ఇంటికి సెలవులకు వచ్చిన నలుగురు చిన్నారులు ఈత సరదా కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మంగంపేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, కొదండాపురం పోలీసుల కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఇబ్రహీం, ఇస్మాయిల్‌లు అన్నదమ్ములు. కర్నూలులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరి చెల్లెలు సలీమా గ్రామమైన మానవపాడు మండలం బోరవెల్లి గ్రామానికి వారి పిల్లలు వేసవి సెలవుల్లో మూడు రోజుల క్రితం వచ్చారు. సోమవారం ఈతకు మేనత్త కుమారుడు ఇమాంతో పాటు కలిసి దాదాపు పది మంది కృష్ణానదికి వెళ్లారు. కృష్ణానది ఒడ్డున ఇసుకలో సరదాగా ఆడిన అనంతరం ఈత కొట్టేందుకు రిహన్ (14) నదిలో దిగాడు.
అయితే రిహన్ మునిగిపోవడంతో కాపాడేందుకు ఆఫ్రీన్ (17) వెళ్లింది. ఆఫ్రీన్ కూడా నీటిలో మునిగిపోతుండటంతో ఆమె చెల్లెలు నౌషిన్ (13) కూడా నీటిలోకి దూకింది. అనంతరం ముగ్గురు మునిగిపోవడంతో వచ్చి రాని ఈతతో సమీర్ (18) కూడా సైతం నదిలోకి దూకాడు. ఒకరిని కాపడబోయి మరొకరు ఇలా నలుగురు నీటిలో మునిగిపోయి మృతి చెందారు. అక్కడ ఉన్న గార్లపాడు జాలర్లు మృతదేహాలను వెలికి తీసి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐలు వెంకటస్వామి, గొకారి తెలిపారు. అయితే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడ ఉన్న వారిని కంటపడి పెట్టించింది.