సిటీబ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘రోప్’ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో రోప్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలులోకి తీసుకుని వచ్చారు. నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ను గాడిలో పెట్టేందుకు అప్పటి ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రోప్‌ను తీసుకుని వచ్చారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రీలెఫ్ట్, రాంగ్ రూట్, స్టాప్‌లైన్, సిగ్నల్ జంప్, ఫుట్‌పాత్ ఆక్రమణ తదితర ఉల్లంఘనలు చేస్తున్న వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్‌లైన్ దాటిన వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పాదచారులు నడిచేందుకు జిబ్రాక్రాసింగ్ ఏర్పాటు చేశారు. దాని వెనుక రెట్‌లైట్ పడినప్పడు వాహనాలు ఆగేందుకు సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ ఏర్పాటు చేశారు. వాహనదారులు స్టాప్‌లైన్ వద్ద ఆగాల్సి ఉంటుంది. కానీ సిగ్నల్స్ వద్ద వాహనదారులు స్టాప్‌లైన్ వద్ద వాహనాలను ఆపకుండా ముందుకు వెళ్లి జిబ్రాక్రాసింగ్ వద్ద ఆపుతున్నారు. ఇలా నగరంలోని అన్ని సిగ్నల్స్ వద్ద నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 1,89,214 వాహనదారులపై జరిమానా విధించారు.
పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై దృష్టి సారించడంతో ఈ ఏడాది నాలుగు నెలల్లోనే భారీగా స్టాప్‌లైన్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. ఒక ఏప్రిల్ నెలలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్టాప్‌లైన్ నిబంధనలు ఉల్లంఘించిన 45,710 వాహనదారులపై జరిమానా విధించారు.
పాదచారులకు ఇబ్బందులు…
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసి స్టాప్ లైన్ వద్ద వాహనాలను ఆపకపోవడంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో ఏ నగరంలో పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో అన్ని నగరాల్లో జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేశారు. వాటి వద్ద నుంచి పాదచారులు రోడ్డు దాటాల్సి ఉంటుంది. నగరంలోని ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారుల కోసం జిబ్రాక్రాసింగ్‌ను ఏర్పాటు చేశారు.
పాదచారుల కోసం ప్రత్యేకంగా సిగ్నల్ ఏర్పాటు చేయకపోవడంతో వీటి ద్వారానే రోడ్డును ఎటువైపైనా దాటాల్సి ఉంటుంది. వాహనదారులు జిబ్రాక్రాంగ్ వరకు వాహనాలను తీసుకుని వచ్చి నిలపడంతో రోడ్డు దాటేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రోప్‌లో భాగంగా వాహనాల దారులు స్టాప్ లైన్‌ను క్రాస్ చేసి ముందుకు రావద్దని పోలీసులు కోరారు. కొద్ది రోజులు వాహనదారులపై జరిమానాలు విధించకుండా అవగాహన కల్పించారు. అయినా కూడా వాహనదారులు నిబంధనలు పాటించకుండా స్టాప్‌లైన్ దాటుతుండడంతో పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు.