బెంగళూరు: ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవర్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక గత బిజెపి ప్రభుత్వ హయాంలో కొత్తగా చేర్చిన పాఠాలన్నిటినీ బోధించవద్దని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఒక సర్కులర్‌ను జారీచేయనున్నట్లు వర్గాలు వెల్లడించాయి. హిందూత్వవాద సిద్ధాంతకర్త చక్రవర్తి సులిబెలె, విద్యావేత్త బెనర్జీ గోవిందాచార్యకు చెందిన పాఠాలను కూడా తొలగించనున్నట్లు వర్గాలు తెలిపాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి చెందిన పాఠ్యపుస్తకాల ముద్రణ ఇప్పటికే పూర్తయిన కారణంగా తిరిగి ముద్రణకు ఆదేశించకుండా కొన్ని పాఠాలను మాత్రం బోధించవద్దని ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుందని వారు చెప్పారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప, ప్రగతిశీల మేధావులు కూడా పాల్గొన్నారు. బోధన, పరీక్ష, మూల్యాంకనం ప్రక్రియ నుంచి వివాదాస్పద, అభ్యంతరకర పాఠ్యాంశాలను కూడా తొలగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
బిజెపి ప్రభుత్వ హయాంలో చేర్చిన వివాదాస్పద పాఠ్యాంశాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, వారం రోజుల్లో ఒక నివేదికను తనకు సమర్పించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు. తదుపరి క్యాబినెట్ సమావేశంలో కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించే అవకాశం ఉంది. కాగా..విద్యార్థుల ఆలోచనలను చెరుపు చేసే పాఠ్యాంశాలను తొలగిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంతకుముందే ఒక విస్పష్టమైన ప్రకటన చేశారు.