* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్నింగ్ వాకింగ్‌లో పర్యటించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజల ఇబ్బందులను గమనించి ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్పించామన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఉన్న ఇబ్బంది తొలగిపోయిందని అన్నారు.
కాలనీ అభివృద్ధి కోసం అవసరమైన అని రకాల చర్యలు చేపడతామని అన్నారు. కరెంట్ ఓల్టేజి సమస్యకై వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి పరిష్కరించాలని ఆదేశించారు. నీటి సమస్య పరిష్కారం కోసం వెంటనే ఒక బోరు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహా రెడ్డి, ప్రేమ్‌నాథ్ రెడ్డి, ఆవుల రమేష్, నాగవరం నరేష్, సుభాష్, పేట తిరుపతయ్య, వెల్డింగ్ రాములు, సూరి, సంపత్, శ్రీనివాసులు, ఎల్‌ఐసి రాములు, కాలనీ వాసులు పాల్గొన్నారు.