నాగర్‌కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వర్గాల కులవృత్తులు, చేతి వృత్తుల వారికి వంద శాతం సబ్సిడీతో అందించే లక్ష రూపాయలు ఆర్థిక సాయం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి వెనుకబడిన తరగతుల అభ్యర్థులు అర్హులని, అభ్యర్థుల వయసు 18 నుంచి 55 సంవత్సరాలు ఉండాలని, వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 1.50 లక్షలు మించరాదని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందని, బిసి కార్పొరేషన్ ద్వారా గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 50 వేలు అంతకంటే ఎక్కుక పొందిన లబ్ధిదారులు అర్హులు కాదని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 20వ తేది వరకు ఆన్లైన్ వెబ్‌సైట్ www.tsobmmsbc.cgg.gov.in ద్వారా ఫోటో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం, జిల్లా సమీకృత కార్యాలయ సముదాయాన్ని సంప్రదించాలని తెలిపారు.