Monday, December 23, 2024

నేడు మంత్రి కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

* స్థానికంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు భూమి పూజ
* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ : నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సెయింట్ ఫౌండేషన్ , శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మొట్టుగడ్డలో ఉన్న బాలికల ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి రేపు మంత్రి కెటిఆర్ భూమి పూజ చేస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్, సెయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు నిర్వహించిన నైపుణ్య శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసే కార్యక్రమం , స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు రేపు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి కెటిఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో మెట్టుగడ్డ … పిల్లల మర్రి రోడ్డులో ఉన్న ఐటిఐ బాలికల కళాశాల వద్ద మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ జి. రవినాయక్, ఎస్పీ కె. నర్సింహ, ఇతర అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. మార్చి నెలలో ప్రారంభమైన నైపుణ్య శిక్షణ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు రేపు కెటిఆర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేయడమే కాకుండా వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో హాస్టల్ వసతి కూడా ఉంటుందని, ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. మహిళలకు నైపుణ్యాలను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆలోచన చేసిన సెయింట్ ఫౌండేషన్ నిర్మాహకురాలు ప్రద్యుమ్మ, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహితలను మంత్రి అభినందించారు. యువజన సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో ఇప్పటికే 45 కోర్సుల్లో యువతకు శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని న్యాక్ ఆధ్వర్యంలోనూ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతకు అండగా నిలిచామన్నారు.
మంత్రి కెటిఆర్ పర్యటన వివరాలు …..
రేపు ఉదయం 10.30 గంటలకు మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ అనంతరం ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు భూమి పూజ చేస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆ తర్వాత పద్మావతి కాలనీ అయ్యప్ప గుట్ట సమీపంలో నిర్మించిన ఆధునిక వైకుంఠధామాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారన్నారు. తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు జడ్చర్లలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, సెయింట్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంచార్జీ కృష్ణదీవి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, వైస్ చైర్మన్ గణేష్, కమిషనర్ ప్రదీప్‌కుమార్ , డీఎస్పీ మహేష్, అధికారులు , ప్రజాప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News