- ఎంపీ రంజిత్‌రెడ్డి
చేవెళ్లరూరల్: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా ఉందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్‌లో సాగునీటి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అధనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఉన్న విజన్‌తోనే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన కేసీఆర్ నాటి ఈ ప్రాంత ప్రజల కష్టాలను వాటిని రూపుమాపడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
ప్రాజెక్టుల రీడిజైన్‌లా ద్వారా పల్లమెరిగిన నీటిని పైకి పారించిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 19 లక్షల ఎకరాలకు సాగు పెంచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.5వేల కోట్లతో చెరువుల పూడికలు తీసి ఏడాదికి రెండు పంటలు పండేలా చేసిన ఘనత సిఎం కేసీఆర్‌దేనన్నారు. నాడు తలమీద గోదావరి ఉన్న మన ప్రాంతం ఎడారిగా ఉండేదని స్వరాష్ట్రంలో సాగునీటి సమస్యలను పరిష్కరించారన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని చూసి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన పలువురు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం ఎంతో అభివృద్ది సాధించిందన్నారు. ఆరవై ఏళ్లలో జరగని పనులు తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. బిఆర్‌ఎస్ హయంలో చేవెళ్ల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందని, నియోజకవర్గంలో బ్రిడ్జిలు, చెక్‌డ్యాంలు నిర్మించి ప్రజలు, రైతులకు ఎంతో మేలు చేయడం జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో 75లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేశారన్నారు. మరో 50 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసుకునే దశాబ్ది ఉత్సవమన్నారు.
సిఎం కెసిఆర్ చేపడుతున్న బంగారు తెలంగాణలో ప్రజలంతా భాగస్వాములై ఆయనకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రంగారెడ్డి, వైస్ ఎంపిపి శివప్రసాద్, దేవునిఎర్రవల్లి సర్పంచ్ మాణిక్యరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ నర్సింలు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.