Monday, December 23, 2024

తమిళనాట త్వరలోనే విజయ్ రాజకీయ అరంగేట్రం?

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: తమిళనాడు రాజకీయాలలో పెనుమార్పులు రానున్నాయా..తమిళ సినీ అగ్రనటుడు తళపతి విజయ్ త్వరలోనే రాజకీయ అరంగ్రేటం చేయనున్నారా..అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ దిశలోనే విజయ్ అచితూచి అడుగులు వేస్తున్నారని, తన రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేసుకుంటున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.

ఇందులో భాగంగానే జూన్ 22న తన 49వపుట్టినరోజును పురస్కరించుకుని తమిళనాడులోని అన్ని జిల్లాలకు చెందిన 10, 12వ తరగతుల స్కూల్ టాపర్స్‌తో విజయ్ భేటీ కానున్నారు. వారికి నగదు బహుమతులు అందచేయనున్నారు. ఈ విషయాన్ని తళపతి విజయ్ మక్కల్ ఇయక్కం(టివిఎం) ధ్రువీకరించింది.

ఈ ప్రకటన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఊహాగానాలు సాగుతుండగా తళపతి విజయ్ మాత్రం వివిధ జిల్లాలకు చెందిన స్కూల్ టాపర్స్‌తో ఎప్పటికప్పుడు సమావేశమవుతూనే ఉన్నారని టివిఎం సెంట్రల్ చెన్నై విభాగం అధ్యక్షుడు విల్లివాకం అశ్విన్ చెప్పారు. మొదటిసారి విజయ్ అన్ని జిల్లాలకు చెందిన స్కూల్ టాపర్స్‌తో సమావేశం అవుతున్న కారణంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు ఆయన చెప్పారు.

విజయ్ రాజకీయ ప్రవేశంపై ఇటీవల జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. తాజాగా అరవింద్ గుణశేఖర్ అనే జర్నలిస్టు చేసిన ట్వీట్‌తో ఈ వదంతులకు బలం ఏర్పడింది. దక్షిణ భారతదేశం నుంచి ఒక నటుడు రాజకీయ వ్యూవహర్తలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం అంటూ ఆ జర్నలిస్టు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News