నాంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేప మందు తీనేందుకు దేశ వ్యాప్తంగా జనం పోటెత్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా తలపెట్టిన అస్తమా రోగులకు బత్తిన కుటుంబం ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది. ఈ దఫా వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం వస్తున్న వారి సంఖ్య క్షణ క్షణం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ఎగ్జిబిషన్ ప్రాంతంలో ఏటూ చూసినా కిక్కిరిసిన జనమే దర్శనమిస్తోంది. నాంపల్లి ఎంజే మార్కెట్, రైల్వేస్టేషన్ తదితర చోట్ల తరుచూ ట్రాఫిక్ తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. 9న ఉదయం చేప మందు పంపిణీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లను శరవేగంగా జరుగుతున్నాయి.
తమకు కట్టబెట్టిన బాధ్యతలు, పనులను అధికారులు సమన్వయంతో దగ్గరుండి పర్యవేక్షస్తున్నారు. సుమారు 90 వేల పైగా చేపలను అందించేందుకు సర్కార్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం దాదాపు 3 లక్షల మంది వరకు జనం రావచ్చని ఎగ్జిబిషన్ సొసైటీ అంచనా వేస్తుంది. మైదానంలోపల ప్రత్యేక షెడ్లలలో రెండురోజులుగా జనం బస చేస్తున్నారు. అనేక మంది ప్రజలు నాంపల్లి ఇతర చోట్ల ధర్మ సత్రాలు, తమ బంధుమిత్రుల ఇళ్లలోను, లాడ్జింగ్‌లో ఇప్పటికే దిగారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తకుండా వివిధ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నారు. వేల మంది జనం ఉన్న టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ మైదానంలో పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.
సుమారు వెయ్యిమంది పైగా పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు సొసైటీ ఆఫీస్‌లో సమీక్షా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అపశృతి వంటి జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తతో ఉన్నారు. మైదానం ప్రవేశ మార్గం వద్ద మీటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు. లోపల సుమారు 70వరకు సీసీ కెమెరాలను బిగించారు. లోపల విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
విపత్తును ఎదుర్కొనేందుకు మైదానంలో పలు చోట్ల ఫైరింజిన్లు ముందుగానే అక్కడ ఉంచారు. ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, ఎపీ, యూపీ తదితర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు కూడా చేప మందు పట్ల ఆసక్తి చూపుతున్నారు.
జనానికి ఫలహారాలు, భోజనాలు షురూ
-చేప ప్రసాదాన్ని తీసుకొనేందుకు వస్తున్న వేల సంఖ్యలో జనానికి ఆకలి, దాహార్తి వంటి సమస్యలు లేకుండా సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. గతంలో లాగే అగర్వాల్ సమాజ్, జైస్వాల్, లింగాయత్ సంఘాలు, మార్వాడీ సంస్థలు రెండురోజులగా వేల మందికి ఫలహారాలు, భోజనాలు, మజ్జిగ, పూరీలు, ఉక్మా, స్వీట్లు, చల్లని పానీయాలు, అల్వ తదితర ఆహారాలు అందించి తమ దాతృత్వాన్ని చాటుతున్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన మినరల్ వాటర్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఈనెల 9న మరిన్ని సంస్థలు రోగుల ఆకలి బాధలు తీర్చేందుకు ముందుకు రానున్నాయి. వేల మందిలో ఒక్కరు కూడా ఆకలి, నీటి దాహార్తితో బాధపడవద్దన్నదే తమ లక్షమని పలువురు చెబుతున్నారు.