Monday, December 23, 2024

రష్యాలో చేదు అనుభవాలకు ఎయిరిండియా క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః ప్రయాణికులకు కల్గిన తీవ్ర అసౌకర్యానికి ఎయిరిండియా గురువారం క్షమాపణలు తెలిపింది. వారి టికెట్ల ఛార్జీలను తిరిగి చెల్లిస్తామని , ట్రావెల్ వోచర్ కూడా ఉంటుందని ప్రకటించింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు మంగళవారం బయలుదేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 777 లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యాలోని మగదన్‌లో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. అక్కడ ప్రయాణికులు అధ్వాన్నపు ఏర్పాట్ల నడుమ నానా తిప్పలు పడ్డారు. ఒకే తివాచీపై వందలాది మంది పడుకోవడం, దోమలు కుట్టడం వంటి అనుభవాలు చవిచూశారు.

ఇంజిన్‌లో సాంకేతిక లోపం పెద్ద సమస్య అయిందని, వెంటనే మార్గమధ్యంలో రష్యాకు విమానం తరలించామని తెలిపిన ఎయిరిండియా , మారుమూల ప్రాంతం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని తెలిపింది. జరిగిన దానికి క్షమాపణలు తెలియచేస్తున్నామని తెలిపారు. ఇక రష్యా నుంచి ప్రయాణికులను ఎయిరిండియాకు చెందిన మరో విమానంలో శాన్‌ఫ్రాన్సికోకు తరలించారు. ఈ విమానం గురువారం క్షేమంగా మజిలీ చేరిందని ఎయిరిండియా విమాన ప్రయాణికుల , ఎయిర్‌పోర్టు రాకపోకల వ్యవహారాల పర్యవేక్షకులు రాజేష్ దోగ్రా తెలిపారు. జరిగిన దానికి చింతిస్తున్నామని , ఎయిరిండియా తరఫున క్షమాపణలు వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటువంటివి ఇకపై జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. మరో విమానంలో ప్రయాణికులను గమ్యం చేర్చారు. ఈ ప్రయాణికులు భవిష్యత్తులో తమ విమానాలలో ప్రయాణించేందుకు వోచర్ కూడా బహుకరించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News