Tuesday, December 24, 2024

మండువేసవిలోనూ నిండుకుండల్లా చెరువులు

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట: చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ గొప్పతనమేనని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు భౌరంపేట్ పెద్ద చెరువు, గాజులరామారం చింతల చెరువు, బాచుపల్లి బిన్ (బైరన్) చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ఊరూరా చెరువుల పండుగలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్యకారులతో కలిసి చెరువు కట్టుకు ఊరేగింపుగా వెళ్లి కట్ట మైసమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలు నాటారు. సభా ప్రాంగణంలో గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు, బతుకమ్మ పాటలను వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసినా ఒక్క చుక్క నీరు ఉండేది కాదని, చెరువులను కాపాడాలనే సోయి కూడా గత పాలకులకు ఉండేది కాదన్నారు. చెరువులపై ఆధారపడిన కులవృత్తులకు బతుకుదెరువు లేక విలవిలలాడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయతో జీవం పోశారని స్పష్టం చేశారు. మండువేసవిలో కూడా చెరువులన్నీ నిండుకుండల్లా కనిపిస్తున్నాయాంటే అది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. ఒకప్పుడు చేపల దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మన ప్రభుత్వ హయాంలో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా గంగపుత్రుల జీవనోపాధి పెరిగిందని పేర్కొన్నారు. అంతరించి పోతున్న కులవృత్తులను కాపాడుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌కి ఉన్న విజన్‌తో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్‌వన్ గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత, డిసిలు మంగతాయారు, ప్రశాంతి, నిజాంపేట్ మేయర్ కొలను నీలగోపల్ రెడ్డి, ఇరిగేషన్ డిఈఈ సురేష్ మరియు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News