ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికీ పునాదులని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మంగళ గూడెం గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుండి 9 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించవలసి ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫారం మరియు వారానికి మూడు కోడి గుడ్లతో పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు.
మన ఊరు మన బడి ద్వారా మంచి నీటి వసతి, మరుగుదొడ్లు, వంటగదులు, పాఠశాల మొత్తానికి రంగులు వేయించారని, ఐఎఫీ టివి ద్వారా డిజిటల్ భోదన చేస్తారని, విద్యార్థులందరికీ చక్కటి భోదన చేస్తూ ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి పునాదులుగా ఉంటాయని, ఈ సదుపాయాలను వినియెగించుకొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యండపల్లి రాధిక, ఎంఈఓ ఎమ్.శాంసన్, ఎస్‌ఎంసి చైర్మన్ వి..దేవేంద్రమ్మ, వైస్ చైర్మన్ బి.నరసింహ, వార్డు మెంబర్ ఉసికల గురవయ్య, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.నాగిరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు ఎన్.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- విద్యార్థుల యూనిఫామ్స్ నాణ్యత పరిశీలన
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళ గూడెం బడిబాట ర్యాలీలో పాల్గొన్న అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఈ . సోమశేఖర శర్మ ప్రాథమిక పాఠశాల మంగళ గూడెంలో విద్యార్థులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా యూనిఫామ్స్ ని పరిశీలించారు. ఈ మధ్యకాలంలో యూనిఫార్మ్స్ నాణ్యత విషయంలో వార్తా పత్రికలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయా పాఠశాలలో యూనిఫామ్స్ యొక్క నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.