నిజామాబాద్ సిటీ : ప్రజా సంక్షేమమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ కర్తవ్యమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం పచ్చని పంట పొలాలతో వర్థిలుతుందన్నారు. ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కుల, మత, ప్రాంత లింగ బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.
అవతరణ ఉత్సవాలలో భాగంగా బిసి కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి లక్ష రుణ సహాయం అందిస్తున్నామన్నారు. నాడు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే భయపడేవారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్య ఆరోగ్య రంగానికి కల్పించిన సౌకర్యాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలు క్యూ కడుతున్నారని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా గర్బిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తున్నామన్నారు. విదేశాలలో చదువుకోవాలనే వారికి ఓవరీ సీస్ స్కాలర్‌షిప్ ద్వారా 20 లక్షల రూపాయలు అందిస్తూ వారి కలను సాకారం చేస్తున్నామన్నారు.
దళితబంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ పది లక్షల రూపాయలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. అలాగే విద్యార్థుల సంక్షేమానికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్యను అందిస్తున్నామన్నారు. ఆసరా పింఛన్ ద్వారా వృద్ధ్దులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్‌లను అందిస్తుందన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ నగర ప్రజలకు భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.