పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో సమైక్య ప్రతిపక్షం అద్భులు చేయగలదని తృనమూల్ కాంగ్రెస్ ఎంపి శత్రుఘ్న సిన్హా ధీమా వ్యక్తం చేశారు. తన స్వస్థలానికి శుక్రవారం వచ్చిన సిన్హా విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23న జరగనున్న ప్రతిపక్ష నాయకుల సమావేశం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చూపుతున్న చొరవ పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశంలో పాల్గొనాలని టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ రాకతో పరిస్థితులు మారిపోతాయని తాను మొదటినుంచి చెబుతున్నానని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలసి ఆమె సమావేశంలో పాల్గొనడం హర్షనీయమని ఆయన అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు సమైక్యంగా పోటీచేసి ప్రస్తుత బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 23న జరిగే ప్రతిపక్షాల ఐక్య సమావేశంలో కనీస ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన జరుగుతుందన్న ఆశిస్తున్నట్లు సిన్హా తెలిపారు. ప్రతిపక్ష కూటమికి వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలు లభించగలవన్న విలేకరుల ప్రశ్నకు తాను జ్యోతిష్కుడిని కానని ఆయన జవాబిచ్చారు. అయితే అద్భుతం జరగగలదని మాత్రం కచ్ఛితంగా చెప్పగలనని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జరగబోయే పరినామాలను సూచించాయని, కాంగ్రెస్ చేతిలో బిజెపి ఓటమిపాలైందని ఆయన అన్నారు.