హైదరాబాద్ : రుతుపవనాల రాకకు ముందు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. మృగశిర కార్తే ప్రవేశించినప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గ టం లేదు. శుక్రవారం నాడు రాష్ట్రంలో అత్యధికంగా కరీనంగర్ జిల్లా తంగులలో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదేవిధమైన అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బూర్గంపహడ్‌లో 45.7,జంబుగలో 45.7, యానంబైలులో 45.6, వీణవంకలో 45.3, మహదేవపూర్‌లో 45.2, జాఫర్‌గడ్‌లో 45.2,కుంచెవెళ్లిలో 45.1, అశ్వరావుపేటలో 45.1, బయ్యారంలో 45డిగ్రీలు నమోదయ్యాయి.రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వగడాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
అక్కడక్కడా ఉరుములతో వర్షాలు
దక్షిణ చత్తిస్‌గడ్ పరిసరాలు ఒరిస్సాలో ఒక ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 1.5కి.మి ఎత్తు వరకూ వ్యాపించి వుంది. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ దిశల నుండి తెలంగాణ వైపునకు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణకేంద్రం తెలిపింది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలో 59 మి.మి వర్షం కురిసింది.