రాంచి: రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఉద్యోగ నియామక విధానాన్ని నిరసిస్తూ జార్ఖండ్ స్టేట్ స్టూడెంట్స్ యూనియన్(జెఎస్‌ఎస్‌యు) ఛత్రం కింద వందలాది మంది విద్యార్థులు శనివారం రాంచిలో 48 గంటల సమ్మెకు(బంద్) పిలుపునిచ్చారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను రాంచిలో మోహరించింది.
ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వం 60:40 నిష్పత్తిలో నూతన నియామక విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం కింద రాష్ట్రంలోని నిరుద్యోగులకు 60 శాతం, ఇతరులకు(ఓపెన్ టు ఆల్) 40 శాతం ఉద్యోగులు కేటాయిస్తారు.
మార్చిలో బడ్జెట్ సమావేశాల చివరిరోజున వందలాది మంది విద్యార్థులు నవ విధాన్ సభ అధికార్ మార్చ్‌ను నిర్వహించి తమ నిరసన తెలిపారు. కాగా..పోలీసులు అసెంబ్లీకి ఒక కిలోమీడరు దూరంలోనే వారిని నిలిపివేసినప్పటికీ నిరసనకారులు రూటు మార్చి పొలాల మీదుగా అసెంబ్లీ చేరుకున్నారు.
విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జితోపాటు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. దీంతో పరిస్థితి హింసాత్మకంగా మారి విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. విద్యార్థి నాయకుడు జైరాం మహతోసహా ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.